Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. జహీరాబాద్, కేసముద్రం, కోహిర్, దేవరకద్ర, అలంపూర్, ఇస్నాపూర్, అమరచింత, జనగామ, ఆసిఫాబాద్, జమ్మికుంట, జిన్నారం, బోధన్, వేములవాడ, గద్వాల, ఆలియాబాద్ లో హంగ్ ఏర్పడింది. హంగ్ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీల్లో స్వతంత్రులు కీలకం కానున్నారు.
జనగామలో హంగ్ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. దీంతో చైర్మన్ పీఠం కోసం నలుగురు స్వతంత్ర అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగిలిన వార్డుల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆలియాబాద్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థిని పలువురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.
ఇక 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 876 వార్డుల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 462 వార్డుల్లో, బీజేపీ 138 వార్డుల్లో విజయం సాధించింది. ఇక గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఇది కూడా బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి వడ్డెపల్లి శీను ఛైర్మన్ అభ్యర్థిగా తన మనుషులను ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేయించి గెలిపించుకున్నాడు. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ ఖాతాలోకే వస్తుంది.