టేక్మాల్: మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యారంగంలో రాణించినప్పుడే సమాజ వికాసంతో పాటు దేశ ప్రగతి సాధ్యమవుతుందని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో చదువుకుని, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరుప్రతిష్టలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. టేక్మాల్ మండల పరిధిలోని దాదాయిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ నర్సింహారావు దేశ్ పాండే ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన విద్యార్థులకు ఉచితంగా సాధారణ సైకిళ్లతో పాటు ఎలక్ట్రికల్ సైకిళ్ల (30)ను పంపిణీ చేశారు.
అలాగే ప్రాథమిక పాఠశాలకు రూ.2.5 లక్షల విలువైన క్రీడా సామాగ్రి, అంగన్వాడి కేంద్రానికి ఫ్రిజ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐ రేణుక మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడే విద్యార్థులను గుర్తించి, సొంత ఖర్చులతో సైకిళ్లు అందజేయడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఎలక్ట్రికల్ సైకిళ్లు ఎంతో సమయాన్ని ఆదా చేస్తాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. సర్పంచ్ నర్సింహారావు దేశ్ పాండే మాట్లాడుతూ.. గ్రామంలోని ఏ ఒక్క విద్యార్థి కూడా పాఠశాల దూరమనే కారణంతో చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
భావి భారత పౌరులైన విద్యార్థులకు తమ వంతు సహాయం అందించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. గ్రామంలో విద్యార్థుల చదువు కోసం సర్పంచ్ చేసిన ఈ గొప్ప సేవను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యానారాయణ, టేక్మాల్, పెద్ద శంకరంపేట ఎస్సైలు అరవింద్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం నర్మద, అంగన్ వాడి టీచర్ మల్లమ్మ, తదితరులు ఉన్నారు.