గాంధీనగర్: కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ ప్రొఫైల్స్, అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, సందేశాలతో వారిని వేధిస్తున్నారు. బాధిత మహిళల ఫిర్యాదులపై పోలీసులు స్పందించారు. రెండు రాష్ట్రాల్లో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. (Online Stalkers Arrest) సోషల్ మీడియా ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న ఫిర్యాదులను గుజరాత్‌లోని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ సీరియస్‌గా పరిగణించింది. మహిళా పోలీస్ అధికారుల నేతృత్వంలో ‘సెక్యూర్ హర్ స్పేస్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్తగా ‘మిషన్ సైబర్ రక్షిత’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్లైన్ వేధింపులు, సైబర్‌స్టాకింగ్, నకిలీ ప్రోఫైల్స్ సృష్టించడం వంటి ఆరోపణలపై ప్రత్యేక బృందాలు జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిపారు. గుజరాత్, రాజస్థాన్‌లోని వివిధ జిల్లాలకు చెందిన 8 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.
కాగా, ప్రధాన నిందితులలో ఒకడైన సురేష్ పూరి, సుమారు 300 మంది మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆరు నెలల వ్యవధిలో 10 నకిలీ ఐడీలు సృష్టించాడని, నగ్న ఫొటోలు, అభ్యంతరకరమైన ఆడియో ఫైల్స్, అశ్లీల సందేశాలతో వారిని వేధించినట్లు ఆరోపించారు.
మరో నిందితుడైన కీయుర్ లక్కర్, పబ్లిక్ ప్రొఫైల్స్ ఉన్న మహిళల స్నేహితులను సంప్రదించడానికి మహిళలుగా నమ్మించే ఎనిమిది నకిలీ ప్రొఫైల్స్ సృష్టించాడని పోలీస్ అధికారి తెలిపారు. బెదిరింపుల కోసం డీప్‌ఫేక్ నగ్న ఫొటోలు సృష్టించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నిందితులు ఉపయోగించినట్లు వివరించారు. ఇలాంటి నిందితులను గతంలో రాజస్థాన్, ఢిల్లీలో కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.