UDAN | తాజా బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మల కొత్త ఉడాన్ పథకం (UDAN Scheme) ప్రకటించారు. మరో 120 రూట్లలో విమాన ప్రయాణాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వచ్చే 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు.
ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా విమానమెక్కాలనుకుంటారు. ఆకాశ మార్గాన విహరించాలని కోరుకుంటారు. అయితే ఈ సంకల్పంతో ప్రారంభించిందే ఉడాన్ పథకం. 2016లోనే ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. ఆర్భాటంతో ప్రారంభించిన ఈ పథకం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఉడాన్ పథకం అమలు.. ఆశించిన స్థాయిలో లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలేసింది కూడా. ఈ మేరకు గతేడాది ఓ నివేదిక విడుదల చేసింది. ఈ పథకం కింద అనుకున్న లక్ష్యం ప్రకారం సగం కంటే ఎక్కువ మార్గాలలో కూడా విమాన సర్వీసులు నడిపించలేకపోయారని తప్పుబట్టింది.
774 రూట్లలో విమాన సర్వీసులు నడిపించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ అందులో 48 శాతం రూట్లలో (371 రూట్లలో) మాత్రమే విమాన సేవలు అందించగలిగారని, 52 శాతం రూట్లలో (403 మార్గాలలో) విమాన సేవలు అందించలేకపోయినట్టు కాగ్ (కంట్రోలర్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో పేర్కొంది. విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 10రెట్లు పెరిగినా, ఆ స్థాయిలో విమాన సేవలు మాత్రం పెరగలేదని మొట్టికాయలేసింది. ప్రజల నుంచి ఈ పథకానికి సానుకూలంగా స్పందన వచ్చినప్పటికీ లక్ష్యాలను సాధించటంలో విఫలమయ్యారన్నది. ఈ పథకం మెరుగుపర్చడానికి, మరిన్ని విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కాగ్ ఈ సందర్భంగా 16 సిఫార్సులను కూడా చేసింది. సామాన్యులకు తక్కువ చార్జీకే సురక్షిత, వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ స్కీం మంచిదే అయినా.. దీని అమలు తీరును మెరుగు పర్చాలని కేంద్రానికి కాగ్ హితవు తెలిపింది. ఈ నేపథ్యంతో ఇప్పుడు మరోసారి బడ్జెట్లో ఉడాన్ ప్రస్తావన తెచ్చింది కేంద్రం. ఇదైనా ఫలితాన్నిస్తుందో లేదో చూడాలి.
Also Read..
Nirmala Sitharaman | నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం 75 నిమిషాలే.. ఇదే రెండో అతి చిన్నది.. !
Union Budget 2025 | రూ. 50,65,345 కోట్లతో కేంద్ర బడ్జెట్.. కేటాయింపులు ఇలా..