Ratha saptami | రేపే రథసప్తమి (Ratha saptami).. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు జన్మించిన మాఘ శుద్ధ సప్తమిని రథ సప్తమిగా చేసుకోవడం సంప్రదాయం. ఆ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఏటా ఈ రథసప్తమి వేడుకలను దేశ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. సూర్యభగవానుడికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రథసప్తమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సకల ప్రాణులకూ ఆరోగ్యాన్నిచ్చే దైవం ఆదిత్యుడు. మయూరుడనే సంస్కృత కవి కుష్ఠురోగ పీడితుడై సూర్యుడిని ఆరాధించి, సూర్య శతకాన్ని రచించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడని కథనం. రామ, రావణ యుద్ధ సమయంలో అగస్త్యుడు రఘురాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. ఆదిత్యుణ్ని ఆరాధించిన తర్వాత శ్రీరాముడు సర్వ శక్తి సమన్వితుడై రావణాసురుణ్ని సంహరించాడు. ఆరోగ్యవృద్ధికి, ఐశ్వర్య ప్రాప్తికి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలని పెద్దలు సూచించారు. సూర్యోపాసనతో సత్రాజిత్తు రోజుకు ఏడు బారువుల బంగారాన్నిచ్చే శమంతకమణి పొందాడని పురాణ కథనం.
సూర్యుడు ఆవిర్భవించిన రథ సప్తమి విశేషమైన పండుగ. ఆనాడు త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని నమ్మకం. సూర్యోపాసన చేయదలచిన వాళ్లు.. షష్ఠి నాడు ఒకేపూట భోజనం చేయాలి. సప్తమి నాడు అరుణోదయానే ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రాగి ఆకులను తల, హృదయం, భుజాలు, మెడ మీద ఉంచుకొని స్నానం చేస్తే మంచిదని పెద్దలు సూచించారు. సూర్యకిరణాల్లోని నిరోధకతను జిల్లేడు ఆకులు ఆకర్షిస్తాయి.
ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యవంతం చేస్తాయని నమ్మకం. సూర్యారాధనలో భాగంగా చిక్కుడు కాయలతో రథం చేసి, అందులో సూర్యుణ్ని ఆవాహనం చేసి షోడశ ఉపచారాలలో పూజించాలి. పాయసం, పొంగలి చేసి నివేదనగా సమర్పించాలి. పాయసాన్ని చిక్కుడు ఆకుల్లో ఉంచి నివేదించడం ఆచారం. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పత్రంలోని ఔషధ గుణాలు మనకు మేలు చేస్తాయని పెద్దలు ఈ సూచన చేశారు. రథ సప్తమి సందర్భంగా.. సూర్యుడితోపాటు సౌరమండలం అంతర్గతంగా ఉన్న దేవతలకు, పితృదేవతలకు అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల వారి అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది.
రథసప్తమి నాడు చిక్కుడు ఆకులు తలపై ఉంచుకొని స్నానం చేయాలా?
సూర్యుడికి ఇష్టమైంది జిల్లేడాకు. అందుకే దానిని అర్కపత్రం అంటారు. జిల్లేడుతోపాటు చిక్కుడాకులకు కూడా సూర్యరశ్మిని ఆకర్షించి, ఇముడ్చుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రకృతి శాస్త్రం చెబుతున్నది. జన్మజన్మలుగా చేసిన శోక, రోగ, పాపాలను పోగొట్టాలనీ, మనో వాక్కాయాలతో అజ్ఞానం వల్ల చేసిన ఏడు విధాలైన పాపాలను, రోగాలను తొలగించాలని సూర్య భగవానుణ్ని కోరుతూ రథసప్తమి నాడు స్నానం చేయాలి. పురుషులు ఏడు జిల్లేడు ఆకులను, స్త్రీలు ఏడు చిక్కుడు ఆకులను తలపై ఉంచుకొని సూర్యోదయంతోనే స్నానం చేయాలి. ఆ మూలికలు మానవాళికి మేలు కలిగించేవని ఆరోగ్య శాస్త్రం చెబుతున్నది. అందుకే వాటికి అంత ప్రాధాన్యం ఏర్పడింది.
సూర్య నమస్కారాలు ఎందుకు చేయాలి?
సూర్యోపాసనలో ముఖ్యమైన అంశం సూర్య నమస్కారాలు. ‘నమస్కార ప్రియో భానుః అభిషేక ప్రియో శివః’ అంటుంది వేదం. అంటే పరమ శివుడు అభిషేక ప్రియుడైతే.. సూర్యుడు నమస్కార ప్రియుడన్నమాట. సూర్యోదయ సమయంలో.. భానుడి కిరణాలు శరీరానికి తాకే విధంగా చేసే యోగాసనాలు మనసును, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. సూర్య భగవానుడి ఆరాధనలో విశేషమైనది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం. రావణుడితో యుద్ధం చేస్తూ అలసిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడట. త్రికరణ శుద్ధితో సూర్యుణ్ని ఉపాసించిన రాముడు మనోబల సంపన్నుడై.. రణంలో రావణుడిని సంహరించాడు.
భానో భాస్కర మార్తాండ చండరశ్మే దివాకర
ఆరోగ్యమాయుర్విజయం శ్రియః మోక్షంచ దేహిమే॥
అనే సూర్య మంత్రాన్ని సాధన చేయడం ద్వారా ఆరోగ్యం, ఆయుర్దాయం, విజయం, మేధాశక్తి కలుగుతాయని పెద్దల మాట.
Also Read..
Monalisa | ఈరోజు పోస్టర్ బయట.. రేపు పోస్టర్ లోపల.. సినీ ప్రయాణంపై మోనాలిసా ఆసక్తికర పోస్ట్
Election Commission | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
Kumbh stampede | కుంభమేళాలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు