న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్నారు. వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లు ఉన్నాయి. ఆరు నెలలు, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు కోత పెట్టినట్టు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది.
దీంతో రుణాలపై వడ్డీరేటు 8.65 శాతానికి దిగిరాగా, రెండేండ్ల రుణాలపై వడ్డీరేటు 8.70 శాతం యథాతథంగా కొనసాగుతున్నది. అలాగే పీఎన్బీ తన వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్ల నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.80 శాతానికి దిగొచ్చింది. వీటితోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐవీబీ, బీవోఐలు కూడా వడ్డీరేట్లను 15 బేసిస్ పాయింట్లు తగ్గించాయి. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యక్తిగత, వాహన, గృహ రుణాలపై ఈఎంఐలు తగ్గనున్నాయి.