సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే వారికే కాదు.. ఇంట్లో ఉన్న ఒంటరి వృద్ధ మహిళకూ నగరంలో రక్షణ లేకుండా పోతుందంటూ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సహారా ఎస్టేట్‌లో ఇట్లో ఉన్న ఓ మహిళ కండ్లలో కారం చల్లి ఆమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను ఓ గుర్తుతెలియని మహిళ అపహరించింది. ఈ నెల 10న కూకట్‌పల్లిలో నివాసముండే రేణు అగర్వాల్‌ను ఆమె వద్ద పనిచేసే వ్యక్తులు హతమార్చి ఇంట్లో దొంగతనం చేసి పరారయ్యారు.
నెల రోజుల క్రితం చంపాపేట్‌లో ఇంట్లోకి చొరబడిన అగంతకుడు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరాయ్యాడు. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళన చెందుతున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలే కాకుండా స్థానికంగా ఉండే దొంగలు, అందులో మహిళలు కూడా స్నాచింగ్‌లు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పెట్రోలింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో, సీసీ కెమెరాలను పర్యవేక్షించే వారు కరువయ్యారు. నేడు సగానికి సగం సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
గేటెడ్ కమ్యూనిటీలలో దొంగతనాలు, దోపిడీలు జరగకుండా సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నా ఇటీవల జరుగుతున్న ఘటనలతో అక్కడ కూడా భద్రత డొల్లా అని తెలిసిపోతున్నది. కూకట్‌పల్లిలో జరిగిన ఘటనతో పాటు తాజాగా వనస్తలిపురంలో జరిగిన ఘటన కూడా గేటెడ్ కమ్యూనిటీలో జరిగిందే. పోలీసులు కూడా తరచూ కమ్యూనిటీ పోలీసింగ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా అలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మెహిదీపట్నం: ఓ యువతి మెడలోంచి బంగారు గొలుసు తెంపుకొని పారిపోతున్న స్నాచర్‌ను పోలీసులు పట్టుకున్నారు. మెహిదీపట్నం పీఎస్‌లో మీడియా సమావేశంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ కిషన్‌కుమార్, ఇన్స్పెక్టర్ మల్లేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో మెహిదీపట్నం బస్టాప్ సమీపంలో మౌనిక అనే యువతి రోడ్డు దాటుతుండగా.. ఓ వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసు తెంపుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కానిస్టేబుళ్లు విక్రం, సిద్ధార్థ సుమారు 200 మీటర్లు పరిగెత్తి స్నాచర్ మహారాష్ట్ర అకోలాకు చెందిన షేక్ అలీం అలియాస్ సోను(30)ను పట్టుకున్నారు. రద్దీ సమయాల్లో చైన్ స్నాచింగ్ చేసి ఎలా పారిపోవాలో యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పథకం వేశానని నిందితుడు చెప్పాడు. అతడి వద్ద నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు.
వనస్థలిపురం: ఆగంతకురాలు ఇంట్లో ఉన్న ఓ వృద్ధురాలి కండ్లలో కారం చల్లి గొలుసు ఎత్తుకుపోయింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి సహారా స్టేట్స్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహారా స్టేట్‌లోని బాహర్ అపార్ట్మెంట్లో డాక్టర్ నిరంజన్, రామసుందరి దంపతులు నివాసముంటున్నారు. శుక్రవారం నిరంజన్ మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఓ ఆగంతకురాలు ఇంట్లోకి చొరబడింది. చున్నీతో ముఖాన్ని కప్పుకుని హాల్లోకి వెళ్లింది. ఇది గమనించిన రామసుందరి ఇంట్లోకి ఎందుకు వచ్చావని అరిచింది. ఆగంతకురాలు తన వెంట తెచ్చుకున్న కారాన్ని ఆమె కండ్లలో చల్లింది. అనంతరం రామసుందరి మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులు (6 తులాలు) లాక్కొని పారిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.