న్యూఢిల్లీ : జీఎస్టీలో (వస్తు, సేవల పన్ను) తీసుకొచ్చిన సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట కల్పించామని కేంద్రంలోని మోదీ సర్కారు ఊదరగొడుతున్నది. అయితే కేంద్రం జీఎస్టీ బాదుడుతో చదువులు మరింత భారం కానున్నాయి. బాల్ పాయింట్ పెన్నులు, ఫౌంటేన్ పెన్నులు, స్కూలు బ్యాగులు, ప్రింటెడ్ పుస్తకాలపై ఈనెల 22 నుంచి 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) బుధవారం కొత్త జీఎస్టీ రేట్లపై నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 3న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. 28 రాష్ర్టాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో జీఎస్టీ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. 7 షెడ్యూళ్లలో దాదాపు 1,200 వస్తువులకు చెందిన కొత్త రేటు జాబితా రూపొందింది. కొత్త జీఎస్టీ రేట్ల అమలుపై పరిశ్రామిక రంగం ఇక దృష్టి సారించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. కొత్త రేటు జాబితా ప్రకారం అన్ని రకాల పెన్నులపై 18 శాతం పన్ను ఉంటుంది. ఫౌంటేన్ పెన్నులు, స్కూలు బ్యాగులతోపాటు ట్రంక్ పెట్టెలు, సూట్‌కేసులు, వ్యానిటీ కేసులు, బ్రీఫ్ కేసులు, బైనాక్యులర్ కేసులు, వాయిద్య పరికరాల కేసులు, హోల్స్టర్లు, ట్రావెల్ బ్యాగులు వంటి వస్తువులు 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. టెక్ట్స్ పుస్తకాలపై 18 శాతం జీఎస్టీ ఉండగా ఎక్సర్సైజ్ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ల్యాబొరేటరీ నోటు పుస్తకాలకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది.
నోట్‌బుక్స్‌పై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం.. టెక్స్‌బుక్స్, ప్రింటెడ్ స్టడీ మెటీరియల్‌పై మాత్రం జీఎస్టీని 18 శాతానికి పెంచింది. దీంతో స్కూల్ పిల్లల టెక్ట్స్‌బుక్స్, స్టడీ మెటీరియల్ ధరలు 10 శాతం నుంచి 15 శాతం మేర పెరిగే ప్రమాదం ఉన్నదని ది ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ (ఓపీఏ) జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కమల్ మోహన్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఇది దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది విద్యార్థులపై, వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కేంద్రం నుంచి ఊరట దక్కలేదు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, ట్యూషన్లు, ఆన్లైన్ కోర్సులు-లెర్నింగ్ ప్లాట్‌ఫాంలపై జీఎస్టీని 18 శాతంగానే కొనసాగించింది. దీంతో జేఈఈ, నీట్, సివిల్స్, సాఫ్ట్వేర్ కోర్సుల్లో చేరాలనుకొనే వారికి, ఆన్లైన్ లెర్నింగ్, క్లాసులు వినే విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట దక్కలేదనే చెప్పాలి. ఉదాహరణకు.. జేఈఈ లేదా నీట్ కోచింగ్ కోసం ఒక విద్యార్థి రూ. 50 వేలు ఫీజు కడితే, దానికి జీఎస్టీ రూపంలో రూ. 9 వేల వరకూ అదనంగా చెల్లించాల్సిందే. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెను భారమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకొన్న నిర్ణయాలపై పునరాలోచన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్కూల్, కాలేజీల ఫీజులపై ఎలాంటి జీఎస్టీ భారం ఉండదని చెప్తున్న కేంద్రప్రభుత్వం.. పాఠశాల నిర్వహణ ఖర్చులపై మాత్రం ట్యాక్సుల మోత మోగించింది. సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కిందకు వచ్చే స్కూల్లో వినియోగించే ఐటీ సేవలు, క్లీనింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, డెవలప్మెంట్ తదితరాలపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఇప్పుడు 18 శాతానికి పెంచింది. ప్రస్తుతం ట్యూషన్ ఫీజుతో పాటు సెక్యూరిటీ, స్కూల్ డెవలప్మెంట్, టెక్, ల్యాబ్ సర్వీసులు ఇలా అన్నింటినీ కలిపి స్కూల్ ఫీజుగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. తాజాగా సప్లిమెంటరీ ఎడ్యుకేషన్‌పై కేంద్రం జీఎస్టీని పెంచడంతో పిల్లల స్కూల్ ఫీజులు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్రెడిట్ చేసుకోలేవు కాబట్టి, ఈ పెరిగిన ఖర్చులు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారాన్ని మిగల్చడం ఖాయమని విద్యావేత్తలు చెప్తున్నారు.