(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కారుణ్య మరణం ప్రసాదించడంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దాదాపు 13 ఏండ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా కాలాన్ని వెళ్లదీస్తున్న 32 ఏండ్ల హరీశ్ రాణా అనే యువకుడి కారుణ్య మరణానికి కోర్టు అనుమతించింది. రాణాకు చికిత్సను నిలిపివేయవచ్చని పేర్కొన్నది. రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. తద్వారా దేశంలో ఓ వ్యక్తికి కారుణ్య మరణం ప్రసాదించిన తొలి కేసుగా ఇది రికార్డులకెక్కింది.
ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా ఇంజినీరింగ్ విద్యార్థి. చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో 2013 ఆగస్టు 20న బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రముఖ దవాఖానల్లో చికిత్స అందించినా.. అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్స కారణంగా రాణా కుటుంబం మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ ఎంతో చితికిపోయింది. దీంతో రాణా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ అతని తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.
సుప్రీంకోర్టులోనూ ఇదే అనుభవం ఎదురైంది. అయితే, రాణా కోలుకొనే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదిక ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులు మళ్లీ సుప్రీం గడప తొక్కారు. రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని రాణా తల్లిదండ్రుల అభిప్రాయాలను కోరింది. తమ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తమ బిడ్డకు మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వాళ్లు కోర్టును వేడుకొన్నారు. దీంతో ఎంత చికిత్స అందించినప్పటికీ, రాణా కోలుకొనే అవకాశం లేకపోవడంతో.. అతనికి అందిస్తున్న ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించాలని కోర్టు తాజాగా ఆదేశించింది.
రాణా కారుణ్య మరణం కేసులో తీర్పును వెలువరించేటప్పుడు బెంచ్‌లో భాగమైన జస్టిస్ జేబీ పార్దీవాలా ఒకింత చలిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక ప్రమాదం రాణా జీవితాన్ని ఊహించని రీతిలో పూర్తిగా మార్చి వేసిందన్న ఆయన ప్రమాదానికి ముందు రాణా ఎంతో తెలివైన, చురుకైన విద్యార్థి అంటూ గుర్తు చేశారు. కేసు పూర్వాపరాలను తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒకరిని ప్రేమించడం అంటే కష్ట సమయంలో కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవడమే. రాణా విషయంలో అతని తల్లిదండ్రులు అదే చేశారు. జీవితం, ప్రేమ, నష్టం ఇలా వీటన్నింటిని పక్కనబెడితే, ఈ కేసు విషయంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ కఠిన నిర్ణయం తీసుకొన్నాం’ అని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నది.
ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చావును కోరుకోరని, కానీ తమకు అలాంటి దుస్థితి వచ్చిందని రాణా తండ్రి అశోక్ రాణా కన్నీటిపర్యంతమయ్యారు. ‘రాణా చదువులో టాపర్. అనుకోని విధంగా ప్రమాదానికి గురయ్యాడు. 13 ఏండ్లుగా దగ్గరుండి వాడిని చూసుకొన్నాం. రాణా పరిస్థితి చూడలేక రాష్ట్రపతి లేదా ప్రధానికి లేఖ రాద్దామని నాలుగేండ్ల కిందట నా భార్య అడిగింది. కారుణ్య మరణం తీర్పు కోసం మూడేండ్లుగా ఎదురుచూస్తున్నాం. తమ బిడ్డల చావును ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అయితే, మేం మా బిడ్డ చావుకు పోరాడాల్సి వచ్చింది. రాణా లాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? వాళ్లందరికీ ఈ తీర్పు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. మా బాధను అర్థం చేసుకొన్న న్యాయమూర్తులకు కృతజ్ఞతలు’ అని అశోక్ రాణా భావోద్వేగానికి గురయ్యారు.
‘అరుణా షాన్‌బాగ్’ కేసుతో దేశంలో కారుణ్య మరణం అంశం తెరమీదకు వచ్చిందని చెప్పొచ్చు. మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ దవాఖానలో (కేఈఎం) 1967లో అరుణా షాన్‌బాగ్ అనే పాతికేండ్ల యువతి నర్సుగా చేరారు. అక్కడ పని చేస్తున్న సందీప్ సర్దేశాయ్తో ఆమెకు పరిచయం ఏర్పడి మరో ఏడాదిలో పెండ్లి చేసుకోబోతున్నారనగా.. ఆమె జీవితం కల్లోలంగా మారింది. అది నవంబర్ 27, 1973. రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అరుణపై సోహన్‌లాల్ వాల్మీకి అనే వార్డుబాయ్ అసహజ రీతిలో అత్యాచారం చేశాడు. అనంతరం కుక్కలను కట్టేయడానికి వాడే గొలుసుతో ఆమె మెడను గట్టిగా బిగించాడు. దీంతో మెదడుకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే నాళాలు దెబ్బతిని ఆమె కోమాలోకి వెళ్లిపోయారు.
కేఈఎం దవాఖానలోనే ఓ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి.. దవాఖాన సిబ్బందే ఆమె బాగోగులు చూసుకొన్నారు. చికిత్స అందించినప్పటికీ అరుణకు ఆరోగ్యం మెరుగుకాకపోవడం, ఆమె నరకయాతన అనుభవిస్తుండటంతో 2011లో జర్నలిస్ట్ పింకీ విరాణి సుప్రీంకోర్టులో ‘కారుణ్య మరణం’ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, అరుణకు కారుణ్య మరణం ప్రసాదించడానికి ఆమె బాగోగులు చూసుకొంటున్న దవాఖాన సిబ్బంది ఒప్పుకోకపోవడంతో విరాణి పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. నాలుగు దశాబ్దాలపాటు జీవచ్ఛవంలా గడిపిన అరుణా షాన్‌బాగ్ 2015లో నిమోనియాతో కన్నుమూసింది.
తమ బిడ్డ చావును ఏ తల్లిదండ్రులూ కోరుకోరు. అయితే, తమ బిడ్డకు మరణాన్ని ప్రసాదించాలంటూ ఆ తల్లిదండ్రులు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు మొర పెట్టుకొన్నారు. ఆ తల్లిదండ్రుల వేదనను చూడలేని కోర్టు కూడా వారి విజ్ఞప్తిని అంగీకరించింది. అచేతనావస్థలో మగ్గిపోతున్న ఆ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు పాఠాన్ని చదువుతూ న్యాయమూర్తి కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దేశ చరిత్రలో తొలి కారుణ్య మరణంగా రికార్డయిన కేసు పూర్వాపరాలివి..