– ఎర్రుపాలెం ఎంపీడీఓకు సీఐటీయూ వినతిపత్రం
ఎర్రుపాలెం, జూలై 17 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో మిషన్ భగీరథ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ.. మండలంలోని 31 గ్రామ పంచాయతీల పరిధిలో 41 మంది మిషన్ భగీరథ కార్మికులు ఎల్ అండ్ టీ ఏజెన్సీ ద్వారా దశాబ్దాలుగా సేవలందిస్తున్నారని తెలిపారు. అయితే ఆధార్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియలో ఇక్కడ పని చేయని 14 మంది కొత్త కార్మికుల పేర్లు జాబితాలో చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వారు ఎక్కడ పని చేస్తున్నారో అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా చేర్చిన కార్మికుల పేర్లను వారు పనిచేస్తున్న సంబంధిత మండలాల వెరిఫికేషన్ జాబితాలో చేర్చి అక్కడే ధృవీకరణ చేపట్టాలని కోరారు.
మిషన్ భగీరథ కార్మికులకు ఏజెన్సీ ద్వారా వేతనాలు సకాలంలో అందడం లేదని, ప్రభుత్వం మంజూరు చేస్తున్న వేతనాల్లో కోతలు విధించి అరకొర వేతనాలు మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ఆందోళనలో బేతి శ్రీనివాసరావు, కొండూరు నాగేశ్వరరావు, రామారావు, భాస్కర్రావు, మోహన్రావు, అబ్రహాం, సాంబయ్య, నాగేశ్వరరావు, సురేష్, లక్ష్మయ్య పాల్గొన్నారు.