తెల్లారకముందే రైతులు లేచి యూరియా కోసం క్యూ కడుతున్నారు. సొసైటీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నెలరోజులకు పైగా అన్నదాతలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. యూరియా కోసం అరిగోస పడుతున్న రైతులకు ప్రభుత్వం సరిపడా ఎరువును అందించడంలో పూర్తిగా విఫలంకావడంతో వారికి కష్టాలు, కన్నీళ్లు తప్పడం లేదు. తెల్లవారుజాము నుంచి లైన్లో వేచిఉన్నప్పటికీ ఒక్క బస్తా కూడా యూరియా దొరకకపోవడంతో అసహనంతో వెనుదిరిగి పోతున్నారు.
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 19: సరిగ్గా వారంరోజుల తరువాత ఖమ్మంరూరల్ మండలంలోని సొసైటీ సహకార సంఘాల సబ్‌సెంటర్లకు అరకొరగా అధికారులు యూరియా సరఫరా చేశారు. ఒక్కటి కాదు.. రెండు కాదు దాదాపు నెలరోజుల నుంచి ఖమ్మంరూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. మక్క, వరి పంట పొలాలు పొట్ట దశకు రావడం, ఈ పరిస్థితిలో యూరియా మరింత అవసరం ఉంటుండటంతో రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. వాయిదాల పద్ధతిలో మండలానికి వస్తున్న యూరియా పంపిణీ రైతులకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వడం లేదు.
ఈ క్రమంలో వారంరోజుల అనంతరం శుక్రవారం ఏదులాపురం వ్యవసాయ సహకార సంఘం, టేకులపల్లి సహకార సంఘాల ఆధ్వర్యంలో గుదిమల్ల, తల్లంపాడు, మద్దులపల్లి, ముత్తగూడెం, పల్లెగూడెం, యంవీ పాలెం, తీర్థాల, కస్నాతండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సబ్ సెంటర్లకు యూరియా దిగుమతి అయ్యింది. సెంటర్ల రద్దీని బట్టి 200-450 బస్తాలు రావడంతో విషయం తెలుసుకున్న టోకెన్ తీసుకున్న, తీసుకోబోయే రైతులు ఆయా సెంటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.
రైతుల తాకిడి భారీగా ఉండటంతో వ్యవసాయ, పంచాయతీరాజ్, సహకార, పోలీస్‌శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో యూరి యా పంపిణీ ప్రారంభించారు. తక్కువ మొత్తంలో బస్తాలు రావడంతో నిర్వాహకులు గతంలో టోకెన్లు తీసుకున్న వారికి మాత్రమే బస్తాలు ఇవ్వడంతో మిగిలిన రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళ్లారు. ఏదులాపురం సొసైటీ గోడౌన్(పల్లెగూడెం, తీర్థాల) సెంటర్ల వద్ద కనీసం రైతులు నిలిచి ఉండేందుకు టెంట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అన్నదాతలు అసహనం వ్యక్తం చేశారు.
కొణిజర్ల, సెప్టెంబర్ 19: తెల్లవారుజాము నుంచి వేచిఉన్నా తమకు ఒక్క బస్తా కూడా యూరియా ఇవ్వలేదని రైతులు ఆందోళనకు దిగిన ఘటన కొణిజర్ల పీఏసీఎస్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. కొణిజర్ల పీఏసీఎస్‌కు గురువారం 40 టన్నుల యూరియా రాగా రైతులు ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం రావాలని సూచించడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచే రైతాంగం వందలాదిగా తరలివచ్చారు. దీంతో రైతుల వద్ద నుంచి ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం జిరాక్స్ తీసుకున్న అధికారులు వాటిని బండిల్స్‌గా ఏర్పాటు చేసి పంపిణీ ప్రారంభించారు.
మొత్తం 35 బండిల్స్ తయారు కాగా వరుస ప్రకారం 14 బండిల్స్ పూర్తయ్యే సరికి ఒక్కో రైతుకు ఒక్కో కట్టా చొప్పున పంపిణీ చేయగా అప్పటికే యూరియా బస్తాలు అయిపోయాయి. తాము తెల్లవారుజాము నుంచి క్యూలైన్లలో వేచి ఉంటే యూరియా కట్టలు అయిపోయాయని అధికారులు చెప్పడంతో అప్పటికే గ్రామపంచాయతీ కార్యాలయంలో కూపన్లను పంపిణీ చేస్తున్న అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో ఏఈవోలను బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై సూరజ్, మండల వ్యవసాయ అధికారి డీ.బాలాజీ రైతుల వద్దకు చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తదుపరి వచ్చే లారీలో ప్రస్తుతం సీరియల్లో ఉన్న రైతులకు యూరియా ఇస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.