న్యూఢిల్లీ : తన బెయిల్ షరతులను మార్చాలంటూ కవి, ఉద్యమకారుడు పీ వరవరరావు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. మహారాష్ట్రలో 2018లో జరిగిన భీమా కోరెగావ్ హింస కేసులో అరెస్టయ్యి బెయిల్పై ఉన్న వరవరరావు.. గ్రేటర్ ముంబై ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే ట్రయల్ కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలంటూ విధించిన షరతును మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
తన క్లయింట్ వరవరరావు మూడేండ్లుగా బెయిల్పై ఉన్నారని, కానీ, అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నదని, ఆయన భార్య హైదరాబాద్లో ఉన్నందున బెయిల్ షరతులు సడలించాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ‘ప్రభుత్వం ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుంది. లేదంటే మీరు ట్రయల్ కోర్టును ఆశ్రయించండి’ అని ధర్మాసనం ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది.