హైదరాబాద్, మార్చి 17 (నమస్తేతెలంగాణ) : ‘మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్టీలేని రుణాలిచ్చామని డిప్యూటీ సీఎం చెపింది తప్పు. రూ.57వేల కోట్ల రుణాలిచ్చినట్టు ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొంటా’నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం, మంత్రి మాటలకు పొంతనలేకుండా పోయిందని ఎద్దేవాచేశారు. ‘స్కూటీలు, నాలుగువేల పింఛన్లు, తులంబంగారం కోసం ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నరు.. సీఎం, డిప్యూటీ సీఎం గ్యారెంటీ కార్డులు ఇచ్చి వారికి ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూపించారు’ అని ఎద్దేవాచేశారు. ‘మాకు మహిళలంటే ఎంతోగౌరవమున్నది. అందుకే తెలంగాణ ఏర్పాటైన తర్వాత సోనియాగాంధీకి కేసీఆర్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ధన్యవాదాలు చెప్పారు. లేకుంటే వేరేవాళ్లలా బలిదేవత అనేటోళ్లం’ అని ఉద్ఘాటించారు. ‘మహిళల గౌర వం గురించి మంత్రులు మాట్లాడటం శోచనీయం. మహిళా మంత్రి ఇంటికి పోలీసులను పంపించిందెవరు? తుపాకీ తలకు పెట్టారని చెప్పి వారి ఓఎస్డీని ఇబ్బందిపెట్టిందెవరు?’ అని నిలదీశారు. ‘మిస్ వరల్డ్ పోటీల్లో విదేశీ అమ్మాయి తెలంగాణలో అన్యాయం జరిగిందని చెప్పింది.. మన పరువు విదేశాల్లో తీశారు. దీనిపై సిట్ వేసి నిందితులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
‘కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు..మహాలక్ష్మీ కింద ప్రతినెలా రూ.2,500 ఇచ్చే పథకాన్ని అమలు చేయాలి.. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి’ అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రూ.4 వేల పింఛన్లు, కల్యాణలక్ష్మీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ హయాంలో మహిళా ఆరోగ్య విప్లవాన్ని తెచ్చిన మహత్తరమైన స్కీమ్‌లకు రాహుల్ పేరు పెట్టయినా అమలు చేయండి’అని డిమాండ్ చేశారు.
పీఆర్సీ కోసం ఉద్యోగులు అష్టకష్టాలు పడుతుంటే బెనిఫిట్స్ కోసం రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని కేటీఆర్ వాపోయారు. బెనిఫిట్స్ అందక రాష్ట్రవ్యాప్తంగా 80 మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసము ద్రం మండలానికి చెందిన కంకాల బీరయ్య, ఖమ్మం జిల్లా ఎనుకూరులో రిటైర్డ్ హెచ్ఎం కూరపాటి సాంబశివరావు, నిరుడు మేలో ఉద్యోగ విరమణ చేసిన వరంగల్‌కు చెందిన ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, భూపాల్పల్లి జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ చిన్నయ్య విరమణ ప్రయోజనాలందక ప్రాణాలు విడిచారని వివరించారు.
ఒకటో తారీఖున జీతాలిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేదు. పాలేరులో మిషన్ భగీరథ ఆపరేటర్ సందబోయిన గాంధీ, సూర్యాపేట హాస్పిటల్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ వసీం అక్తర్‌ఖాన్ ఆత్మహత్య చేసుకున్నరు. ఇలా గోపాలమిత్రలు, గిరిజన ఆశ్రమ స్కూళ్లలో వంట మహిళలు, మున్సిపల్, పల్లె దవాఖానల సిబ్బంది, గురుకులాల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు జీతాలు రావడంలేదు.
– కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. రుణమాఫీకి రూ.50 వేల కోట్లు అవసరమని చెప్పి కేవలం రూ. 20 వేలకోట్లే వేసి మిగిలిన రైతులను ముంచిండ్రు’అంటూ విరుచుకుపడ్డారు. ‘ఏ ఒక్క గ్రామంలోనైనా రుణమాఫీ సంపూర్ణంగా జరిగిందని నిరూపించండి..అది కొండారెడ్డిపల్లె, కొడంగల్, మంథని ఎక్కడైనా జరిగిందని రుజువు చేయండి అక్కడే రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.
‘ఎనుములవారి పాలనలో ఎరువులకు దిక్కులేదు. వారికి బఫర్జోన్ల మీద ఉన్న శ్రద్ధ బఫర్స్టాక్ల మీద లేదు’ అని తనదైన శైలిలో కేటీఆర్ చురకలంటించారు. మున్సిపల్ ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ.9వేల కోట్లు ఇస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి మాటకు విలువలేకుండా పోయిందని విమర్శించారు. 2014లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు వేస్తే 2023లో కాళేశ్వరం, మిషన్‌కాకతీయ కారణంగా 2.20 కోట్ల ఎకరాల్లో పంటలు వేశారని గుర్తుచేశారు.
‘విద్యాశాఖ మంత్రి హార్వర్డ్‌లో ముచ్చటపడి చదువుకున్న చదువుకు సర్కార్ సొమ్ము ఖర్చు చేశారు. కానీ పేద విద్యార్థుల రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు మాత్రం ఇస్తలేరు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. విద్యా నిధి స్కీమ్ కింద కేసీఆర్ ఎంతోమంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనారిటీ బిడ్డల విదేశీ విద్యకు రూ.25 లక్షల చొప్పున అందజేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సర్కార్‌వి నెగెటివ్ ఆలోచనలు.. నెగెటివ్ విధానాలని కేటీఆర్ విమర్శించారు. ‘కుర్చీ ఎక్కగానే ఎయిర్‌పోర్టు మెట్రో రద్దు.. ఫార్మాసిటీ రద్దు.. ఎస్సార్డీపీ రద్దు.. ఎస్ఎన్డీపీ (నాలా డెవలప్మెంట్) రద్దు.. రాత్రి పది దా టితే షాపులు తెరువొద్దు.. ఇలా అన్నీ తిరోగమన విధానాలే’ అని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ సర్కార్ డ్రైవర్లను ఓనర్లు చేస్తే కాంగ్రెస్ ఓనర్లను డ్రైవర్లు చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఇటీవలే తాను జూబ్లీహిల్స్‌లో ఆటో ఎక్కి ఆఫీస్‌కు వెళ్లానని.. ఆ ఆటో డ్రైవర్ మస్రత్ అలీ ఆటోకార్మికుల స్థితిగతులపై ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. ఫ్రీ బస్సుకు వ్యతిరేకం కాదని, ఇంకా బస్సులు పెంచాలని, ఏసీ బస్సుల్లోనూ అమలు చేయాలని, బస్సుల్లో మహిళలు కొట్టుకోకుండా చూడాలని సూచించారు. ‘అద్దె బస్సులను పెంచకండి.. ఆర్టీసీని ముంచకండి’ అని కోరారు.
28 నెలల్లో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లయి నా మంజూరు చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒక్కటైనా కట్టినట్టు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఒక్క ఇల్లు కట్టకున్నా హైదరాబాద్‌లో వేలాది ఇండ్లను కూల్చారని ఆవేదన వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో ప్రజాపాలనను ఎంజాయ్ చేస్తున్నది ఒకటి దొంగలు.. రెండు దోమలు మాత్రమేనని కేటీఆర్ దెప్పిపొడిచారు. హైదరాబాద్‌లో దొంగతనాలు, క్రైమ్‌రేట్ పెరిగినట్టు సర్కార్ లెక్కలే చెప్తున్నాయని వివరించారు. నగరంలో ఇది వరకు ఒకే ఒక్క దోమల్‌గూడ ఉండేదని.. ఇటీవల నగరంలో రెండు ప్రాంతాలకు డొనాల్డ్ ట్రంప్.. మన్మోహన్ సింగ్ పేర్లు పెట్టారని, ట్రంప్ పేరు కాకుండా దోమలగూడ.. దోమలహిల్స్.. దోమలబాదు..దోమలగుట్ట.. దోమలపూల్ అని పేర్లు పెడితే సరిపోయేదని ఎద్దేవాచేశారు.
రాష్ట్రంలో గృహమేధ యాగం జరుగుతున్నదని కేటీఆర్ నిప్పులుచెరిగారు. ‘ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి గ్రాఫిక్స్‌తో అదరగొడుతున్నారు. ఇటీవలే ఖమ్మం వెళ్లిన.. అక్కడ ఇరా న్.. ఇజ్రాయెల్ వాళ్లు బాంబులేశారేమోనని భయపడ్డం. కానీ ఈ ప్రభుత్వానికి బాంబులు అవసరం లేదు. బుల్డోజర్లు చాలు’ అని చురకలంటించారు. ‘ఫార్మాసిటీ రద్దు, మూసీ సుందరీకరణ పేరిట వేల ఎకరాలు.. హిల్ట్ పేరి ట 9 వేలు.. కంచె గచ్చిబౌలి పేరిట వందల ఎకరాలు.. మెట్రో స్వాధీనం పేరిట 280, హైడ్రాపేరిట వందల ఎకరాలు.. హౌసింగ్‌బోర్డు స్థలాలు ఇలా భూముల చుట్టూ ప్రభు త్వం పరిభ్రమిస్తున్నది’ అని మండిపడ్డారు.
నిషేధిత జాబితాలోని భూములు గతంలో 20 లక్షలుంటే.. ఈ రోజు కోటి ఎకరాలకు చేరాయని, దీని వెనుక ఏం జరుగుతున్నదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఇష్టారీతిన ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, ఇష్టమెచ్చినట్టు కమీషన్లు పుచ్చుకోవడం ఇదేకదా మీరు చేస్తున్న స్కామ్?’ అని నిలదీశారు. ‘కాంగ్రెస్ పాలన గోల్‌మాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. భూగర్భంలో బొగ్గు గోల్మా ల్.. నది గర్భంలో ఇసుక గోల్మాల్.. రాలిపడే బూడిదలో గోల్మాల్. లిక్కర్బాటిల్ మూతల మీద గోల్మాల్.. కంచె గచ్చిబౌలి భూముల్లో గోల్మాల్. అమృత్ టెండర్లల్లో గోల్మాల్’ అని కేటీఆర్ తూర్పారబట్టారు.
‘బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీచేసినా పార్టీ ఫిరాయింపుపై క్లిన్‌చిట్ ఇస్తే ఎట్లా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. దీంతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ కల్పించుకొని స్పీకర్‌ను ప్రశ్నించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. దీనికి ప్రతిగా కేటీఆర్ మాట్లాడుతూ ‘స్పీకర్ స్థానం అత్యున్నతమైనదే. మేం కాదనడం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం, నిలదీయడం మా బాధ్యత. తప్పకుండా అడుగుతాం. హైకోర్టు జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్తే.. డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నది’ అని చెప్పారు. ‘దేశంలో ఆయారాం.. గయారాం కల్చర్‌ను తెచ్చిందే కాంగ్రెస్.. హర్యానాలో మీరే ఫిరాయింపులను ప్రోత్సహించారు’ అని ఎదురుదాడి చేశారు.
‘గ్రహణం కొంత కాలమే.. రెండు గంటలే ఉంటుంది. అధికారమిచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించొద్దు. మేం ఊరికే రాలేదు. ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చినోళ్లం. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం.. తెలంగాణ ఖ్యాతికి మచ్చతెస్తే మౌనంగా ఉండం. హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో ఫ్యాక్షన్, హింసా సంస్కృతిని కాంగ్రెస్ పాలకులు ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘నూతనకల్ మండలంలో ఉప్పల మల్లయ్యను హత్య చేసిండ్రు. ఒకాయనకు మూత్రం తాగించిండ్రు.. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని ఏకంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చిండు.. కామారెడ్డి జిల్లా సోమారంపేటలో గెలిచిన వారిపై ట్రాక్టర్ ఎక్కించిండ్రు. క్యాతనపల్లిలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా మా పార్టీ నేతలపైనే దాడిచేసిండ్రు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, గ్యాదరి కిశోర్, బాల్క సుమన్, కౌశిక్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీద దాడులు. సుంకె రవిశంకర్ ఇంటిమీద, హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్, సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేయడం అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసులు పెట్టారు. మణుగూరు, భువనగిరిలో ఆఫీసుల మీద దాడులు చేసిండ్రు. సోషల్ మీడియాలో రీ ట్వీట్‌చేస్తే 20 రోజులు జైలుకు పంపారు. పండుగ పూట జర్నలిస్టులను జైల్లో పెట్టిండ్రు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?’ అని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత 60 వేల ఉద్యోగాలిచ్చామని ముఖ్యమంత్రి పదే పదే అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 11,921 మాత్రమేనని చెప్పారు. మిగతా ఉద్యోగాలకు కేటీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రియ అంతాపూర్తి చేస్తే ఈ ముఖ్యమంత్రి కాయిదాలు ఇచ్చారని దుయ్యబట్టారు. ‘వేరే రాష్ర్టాల్లో ఉద్యోగాలివ్వాలని ధర్నాలు చేస్తుంటే మన రాష్ట్రంలో వద్దని నిరసనలు తెలుపుతున్నరు’ అని సీఎం పచ్చి అబద్ధాలు చెప్తున్నడు’ అని విరుచుకుపడ్డారు.
దళితబంధుకు బొందపెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘బీసీలకు ఐదేండ్లల్లో లక్షకోట్ల బడ్జెట్ ఏది? రెండేండ్లల్లో 20 వేల కోట్లు కూడా ఇవ్వలే.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరిట ఉన్న 24 శాతం కోటాను కూడా 17 శాతానికి తగ్గించి పాపం మూటగట్టుకున్నరు. దీనిని సవరించి పాప ప్రక్షాళన చేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
హిల్ట్ పాలసీ పేరిట కుంభకోణాలకు తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. ‘ఆలిండ్ అనే ఫ్యాక్టరీ.. పెంగ్విన్ టెక్స్టైల్స్.. ఎవ్రీడే బ్యాటరీస్ కంపెనీల భూములు చేతులు మారుతున్నయి. దీని వెనుక పెద్దల హస్తమున్నది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల సొమ్మని, 9 వేల ఎకరాలను ప్రైవేట్‌కు సంతర్పణ చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.
గోదావరి, కృష్ణా జలాల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. ‘కాళేశ్వరం కూలితే మల్లన్నసాగర్ ద్వారా గండిపేటకు నీళ్లు ఎలా తెస్తారు? తమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు తెస్తామంటున్నరు.. మరి కాళేశ్వరమే లేకుంటే సుందిళ్ల ఎక్కడిది?’ అని ప్రశ్నించారు. 80 వేల కోట్లు ఖర్చుచేసిన ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి అన్నారని, అబద్ధాలతో ఎన్నికల్లో గెలిచారని మండిపడ్డారు.
సింగరేణిలో సృజనాత్మక లీలలు జరుగుతున్నాయని.. ఈ లీలలను ఇకనైనా బంద్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గుజరాత్లో గనులను నామినేషన్ పద్ధతిపై ఇస్తున్నట్టే సింగరేణికి ఎందుకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వరని ప్రశ్నించారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చి థర్మల్ విద్యుత్తు ప్లాంట్లు ఎందుకు పెడుతున్నారని, అది కూడా ఒక మెగావాట్‌కు రూ.14కోట్ల చొప్పున ఎందుకు వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బదులు ఎన్టీపీసీ నుంచి విద్యుత్తు తీసుకోవాలని కోరారు.