కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 14: కూకట్పల్లి మండలం హైదర్‌నగర్ గ్రామంలోని సర్వే నంబర్ల 145, 163లను వెంటనే 22ఏ జాబితా నుంచి తొలగించాలని, లేకుంటే ప్రజలతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు నివాసంలో బాధిత కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ మనూ చౌదరిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… హైదర్‌నగర్ గ్రామంలో సర్వే నంబర్లు 145, 163లలో 50 ఏండ్ల కిందట వసంతనగర్, సర్దార్‌పటేల్ నగర్, భగత్‌సింగ్‌నగర్, ఎస్ఎస్ కాలనీ, సీబీసీఐడీ కాలనీ, డ్రీమ్వ్యూ కాలనీలు ఏర్పడ్డాయని, ఆ కాలనీల్లో మున్సిపాలిటీ, హెచ్ఎండీఏ అనుమతులతో ఇండ్లను నిర్మించుకొని ఉంటున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా… ఈ సర్వే నంబర్లను నిషేధిత భూములు(22ఏ)లో చేర్చడం వల్ల ఆయా కాలనీలో భూములను అమ్మాలన్నా… బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా, ఇండ్లను నిర్మించుకోవాలన్నా… అవకాశం లేకుం డా పోయిందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తే సానుకులంగా స్పందించారన్నారు. ప్రభుత్వమే జీవో జారీ చేసి డబ్బులు కట్టించుకున్న ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఫైనల్ డిక్రీలు ఉన్న స్థలాన్ని కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేపీహెచ్‌బీ కాలనీలో విలువైన స్థలాన్ని కాపాడామని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 గజాల భూమిని కూడా వదలకుండా అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. కాలనీలో నిరుపయోగంగా ఖాళీ స్థలాలను, హౌసింగ్ బోర్డు స్థలాలను ప్రజలకు ఉపయోగపడే పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దామని, నేడు ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆగ్రహంతో ఉన్నారని, 22ఏ నిషేధిత జాబితాపై పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 22ఏ సమీక్ష జరిపి, 50 ఏండ్ల కిందట వెలసిన కాలనీలను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొటర్ మందడి శ్రీనివాస్‌రావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి రాజేష్‌రాయ్, వసంతనగర్ కాలనీ అధ్యక్షుడు ఏర్రా నాగేశ్వర్రావు, ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అధ్యక్షుడు హనుమంతరావు, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.