హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తేతెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తు కు ఓటేసి ఢిల్లీకి చెందిన బేకార్ పార్టీలను తరిమికొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్సోళ్ల మాయమాటలు నమ్మితే నిండా మునుగుడు తప్పా ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారు. 24 నెలల్లో హైదరాబాద్‌లో ఒక్క గుంతపూడ్చని, ఇటుక పెళ్ల పేర్చని సీఎం రేవంత్‌రెడ్డి.. హైడ్రా తెచ్చి వేలాది పేదల ఇండ్లను నేలమట్టం చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇండ్లపైకి బుల్డోజర్లు పంపి ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యామా? కనీసం ఒక్క బ్రిడ్జ్ అయినా కట్టావా? అండర్ పాసైనా అందుబాటులోకి తెచ్చినవా? ఫ్లై ఒవర్కైనా ముగ్గుపోసినవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధి లోని ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు, బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు ఏ విధంగా ముందు కెళ్లాలి..తీసుకోవాల్చిన జాగ్రత్తలు..అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ‘కేసీఆర్ మళ్లీ రావాలంటే కాంగ్రెస్‌కు సురుకుపెట్టాలి..జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మొదలుపెట్టాలి..’ అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చెయ్యి గుర్తుకు ఓటేస్తే హైడ్రా కూల్చివేతలకు లైసెన్స్ ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు ఢిల్లీ పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మకుండా సరైన తీర్పే ఇచ్చారని పేర్కొన్నారు. కానీ పల్లె ప్రజలు కాంగ్రెస్ ఇచ్చే పథకాలకు ఆశపడి ఇప్పుడు అరిగోస పడు తున్నారన్నారు. రెండేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు. ‘యువతకు స్కూటీలివ్వలేదు..వృద్ధుల పింఛన్లు పెంచలేదు..ఒక్క ఇల్లుకట్టలేదు..రైతుబంధు ఇవ్వలేదు..తులం బంగారం పత్తాలేదు..ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 ముచ్చటలేదు..జాబ్ క్యాలెండర్ జాడలేదు..’ కానీ యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కగానే హైడ్రాను తెచ్చి నగర ప్రజలకు నరకం చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎఫ్టీఎల్లో ఉన్న రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి, మంత్రులు పొం గులేటి, వివేక్, కాంగ్రెస్ నేత కేవీపీ ఇండ్లను వదిలిపెట్టి పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతున్నారని తూర్పారబట్టారు. తన ఇల్లు కూల్చివేస్తారనే భయంతోనే కూకట్‌పల్లికి చెందిన బుచ్చమ్మ ఉరేసుకొని తనువు చాలించిందని గుర్తుచేశారు. కనీసం చిన్న పిల్లల పుస్తకాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకోనియలేదని చెప్పారు.
కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలు నమ్మి ఓటస్తే ఇక మాకు తిరుగులేదని భావించి మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ‘ఇప్పుడు పక్క బస్తీలకు వచ్చిన హైడ్రా రేపు మీ ఇండ్లపైకి వస్తుంది..బుచ్చమ్మ గతే మీకు పడుతుంది..అప్రమత్తంగా ఉండండి..ఆలోచించి నిర్ణయం తీసుకోండి..’అని హితబోధ చేశారు.
చేతిలో తిరుగులేని అధికారం ఉన్న కేసీఆర్ ఏనాడు పేదలపై ప్రతాపం చూపలేదన్నారు. గుడెసెల్లో ఉంటున్న లక్షల మందికి పట్టాలిచ్చారని, లక్ష ఇండ్లు కట్టించారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఆయన కృషిని గుర్తించే నగర పరిధిలోని అన్ని సీట్లు గెలిపించారని చెప్పారు.
రేవంత్‌రెడ్డి మాత్రం అసమర్థ పాలనతో హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నారని మండిపడ్తారు. నిజంగా రేవంత్‌రెడ్డికి మంచిపేరు రావాలంటే కేసీఆర్ ఇచ్చినదాని కంటే రెట్టింపు పనులు చేయాల న్నారు. అంతేగానీ నిరుపేదలను అరిగోస పెట్టవద్దని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లను నమ్మితే మన కంటిని మన వేలితోనే పొడిపించుకున్నట్టేనని..అది బంద్ అయితది..ఇది బందయితదనే వారి బెదిరింపులకు లొంగిపోతే వాళ్ల దోపిడీకీ లైసెన్స్ ఇచ్చినట్టేనని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి తన పాలనలో ప్రజలకు ఉద్ధరించిందేమీలేదని మండిపడ్డారు. కానీ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లు, బిల్డింగ్‌లకు పెయింటింగ్ వేయడం..రిబ్బన్ కటింగ్‌లు మాత్రం గొప్పగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇందుకోసమే పొద్దంతా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతు న్నారని అపహాస్యం చేశారు. వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారెంటీ లకు రెండేళ్లయినా ముహూర్తం దొరకడంలేదా? అని చురకలంటించారు. ’కేసీఆర్ అవ్వా తాతల్లో ఒక్కరికే రూ. 2 వేలు ఇస్తున్నారని, నేనొస్తే ఇద్దరికీ నెలకు రూ. 4 వేల పింఛన్ ఇస్తానని, అత్తకు రూ. 4వేలు, కోడలుకు రూ. 2500 ఇస్తానని నమ్మబలికారు..ఇప్పు డేమో ఉన్న పింఛన్లకు కోతపెట్టి నిలువనా ముంచుతున్నరు..’ అంటూ తీవ్రస్థాయిలో దు య్యబట్టారు. పైసల విషయంలో అత్తాకోడళ్లకు పంచాయితీ పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అప్పుల పేరు చెప్పి చేతగాక తప్పించుకుంటున్నారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్‌లోని ముస్లింల ఓట్లకోసమే సీఎం రేవంత్‌రెడ్డి అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పేరిట ఢోకా చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఆయన ఎంపిక చెల్లబోదని కేటీఆర్ తేల్చిచెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అప్పటి బీజేపీకి చెందిన మహిళా గవర్నర్ తిరస్కరించిన విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు చెప్పినా వినకపోవడంతో శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమీర్‌అలీఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయగా బీజేపీతో రేవంత్‌రెడ్డికి ఉన్న మైత్రిబంధంతో మోడీ సూచన మేరకు గవ ర్నర్ ఆమోదించారన్నారు. కానీ కేసు పెండింగ్‌లో ఉండగా ఎలా ఎంపిక చేస్తారని సుప్రీంకోర్టు వారి ఎన్నిక చెల్లదని మధ్యంతర తీర్పును వెలువరించిందని తెలిపారు. అయితే ఇప్పుడు అమిర్అలీఖాన్ను పక్కనబెట్టి అజారుద్దీన్‌ను మళ్లీ తెరపైకి తెచ్చి ముస్లింల ఒట్లను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను అడ్డం పెట్టుకొని ముస్లింలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
మోడీ, అదానీ విషయంలో రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీతో విబేధిస్తున్నారని చెప్పారు. మోడీని రాహుల్ చౌకీదార్..ఓట్ చోర్ అంటే రేవంత్‌రెడ్డేమో బడే భాయ్ అంటున్నరు.. ఆయన ఆదానీని అవినీతి పరుడంటే, ఈయనేమో మంచి దోస్త్ అంటడు..ఆయన సీబీఐని కరాబ్ అంటే.. ఈయనేమో అచ్చాయే అంటడు. ఆయన గుజరాత్ మోడల్ బేకార్ అంటే ఈయనేమో బాగున్నది అంటడు’ అంటూ రేవంత్, మోడీ మైత్రి బంధాన్ని కేటీఆర్ ఎత్తిచూపారు. పక్కన ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తే రేవంత్‌రెడ్డి మాత్రం ద్వారాలు తెరిచారని తూర్పారబట్టారు.
రేవంత్‌రెడ్డిని అడ్డంపెట్టుకొని కేసీఆర్‌ను ఖతం చేసేందుకు గులాబీ జెండాను ఎగురకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ను అడ్డం తొలగించుకొని కాంగ్రెస్‌ను ఫుట్‌బాల్ ఆడుకోవాలనేదే బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు రెండు ఢిల్లీ పార్టీల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ల నేతలు ఎన్నికల టికెట్లు, పదవులు.. నిధులు కావాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ ప్రజలను గాలికొదిలి ఎక్కే విమానం..దిగే విమానం తరహాలో 54 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని దెప్పిపొడిచారు.
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్‌చట్టాన్ని దేశంలోని తొలిసారిగా తెలంగాణలో అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచిన ఘనత ఆయనకే దక్కిందని చురకలంటించారు. ముస్లింలకు వ్యతిరేకమైన ఆ చట్టాన్ని రాజ్యసభలోని బీఆర్ఎస్ నలుగురు సభ్యులు వ్యతిరేకించారని గుర్తుచేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో ముస్లింల పక్షపాతిగా అనేక స్కీంలకు అంకుర్పారణ చేశారని చెప్పారు. ’రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడైనా మోడీ పార్టీలో స్కూల్ విద్యను అభ్యసించిన్రు.. చంద్రబాబు వద్ద కాలేజీ పూర్తిచేసిన్రు..ఇప్పుడు రాహుల్‌గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నరు..మన దగ్గర కూడా హైస్కూళ్లలో చేరిన్రు..కానీ పిల్లాడి బుద్ధి బాగాలేదని కేసీఆర్ హైస్కూల్ నుంచి వెళ్లగొట్టిన్రు.. అన్ని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయం మాత్రం దాచిపెడుతున్నరు..’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.