ముంబై, మార్చి 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మెటల్, ఆటో రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడం కలిసొచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 567.99 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి 76,070.84 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 801.41 పాయింట్లు పుంజుకోవడం విశేషం. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 172.35 పాయింట్లు లేదా 0.74 శాతం ఎగబాకి 23,581.15 దగ్గర నిలిచింది. కాగా, అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నడుమ వరుస నష్టాల నుంచి తేరుకొని సోమవారం సెన్సెక్స్ 938.93, నిఫ్టీ 257.70 పాయింట్లు పెరిగిన విషయం తెలిసిందే.
సెన్సెక్స్ షేర్లలో..
ఎటర్నల్ అత్యధికంగా 5.70 శాతం లాభపడింది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ షేర్లకూ కొనుగోలు మద్దతు లభించింది. అయితే ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రంగాలవారీగా.. మెటల్ 2.81 శాతం, ఆటో 2.05 శాతం, రియల్టీ 1.79 శాతం, కమోడిటీస్ 1.69 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.40 శాతం, టెలికాం 1.24 శాతం, బ్యాంకింగ్ 0.90 శాతం మేర లాభపడ్డాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.86 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.67 శాతం పెరిగాయి. ఆసియాలోని ప్రధాన దేశాల మార్కెట్లలో దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు లాభపడగా.. జపాన్, చైనా సూచీలు నష్టపోయాయి. కానీ ఐరోపా, అమెరికా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఆల్‌టైమ్ కనిష్ఠానికి రూపీ
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరోసారి ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మంగళవారం ఫారెక్స్ మార్కెట్లో దేశీయ కరెన్సీ మునుపెన్నడూలేని స్థాయికి క్షీణించింది. ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 92.35గా మొదలైన రూపీ వ్యాల్యూ.. ఒకానొక దశలో 92.47కు పడిపోయింది. చివరకు తొలిసారి 92.40 దగ్గర ముగిసింది. దీంతో సోమవారంతో చూస్తే 12 పైసలు నష్టపోయినైట్టెంది. గల్ఫ్ దేశాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలను ఎగదోస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరుగుతున్నది. ఇది రూపాయి మారకం విలువను అంతకంతకూ పడదోస్తున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లు సైతం రూపాయిని ఒత్తిడికి గురిచేస్తున్నట్టు చెప్తున్నారు. భారతీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. మెజారిటీ ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ నిల్వలు గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి.