న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : కాలిఫోర్నియాలో ఇటీవల పోలీసు కాల్పుల్లో మరణించిన 30 ఏళ్ల భారతీయ టెకీ తన మాజీ యజమాని, సహోద్యోగులు, రూమ్మేట్స్ నుంచి జాత్యహంకార వివక్షను ఎదుర్కోవడమేగాక అతని ఆహారంలో విషం కలిపేంత తీవ్రస్థాయికి పరిస్థితి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ నిజాముద్దీన్ తన మరణానికి కొన్ని రోజుల ముందు లింక్డ్ఇన్ పోస్టులో తాను జాతి విద్వేష బాధితుడినని రాసుకున్నారు. అమెరికన్ మనస్తత్వానికి ముగింపు పలకాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తనకు జీతంలో అన్యాయం జరిగిందని, తప్పుడు పద్ధతిలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన తెలిపారు. బలవవంతంగా ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో తన పరిస్థితి మరింత దిగజారిందని నిజాముద్దీన్ వివరించారు. జాతి విద్వేషం, జాతి వివక్ష, జాతి వేధింపులు, చిత్రహింసలు, జీతంలో మోసం, అన్యాయంగా ఉద్యోగం నుంచి ఉద్వాసన, న్యాయం దక్కకుండా అవరోధాలు వంటి వేధింపులకు తాను బాధితుడినని నిజాముద్దీన్ తన పోస్టులో తెలిపారు.
ఈరోజు అన్ని రకాల ఇబ్బందులకు వ్యతిరేకంగా తన గొంతు విప్పుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక చాలు, తెల్లజాతీయుల ఆధిపత్యం/జాతి వివక్షతో కూడిన అమెరికన్ మనస్తత్వానికి ఇక ముగింపు పలకాలని ఆయన తెలిపారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా జాత్యహంకార డిటెక్టివ్ ద్వారా తనపై వేధింపులు కొనసాగాయని ఆయన తెలిపారు. తన ఆహారంలో విషం కలపడమేగాక ఇప్పుడు బలవంతంగా ఇంటి నుంచి వెళ్లకొడుతున్నారని ఆయన పోస్టులో రాశారు. తన సహోద్యోగులు, యజమాని, క్లయింట్, డిటెక్టివ్, వారి బృందం ప్రధాన దురాక్రమణదారులుగా ఆయన అభివర్ణించారు. ఈరోజు తనకు జరిగిన అన్యాయం రేపు ఎవరికైనా జరగవచ్చని, తనకు న్యాయం చేసేందుకు సాయపడాలని ఆయన ప్రపంచాన్ని అర్థించారు. కాగా, సెప్టెంబర్ 3న శాంటా క్లారాలోని తన నివాసంలో తన రూమ్మేట్ను కత్తితో పొడిచారన్న ఆరోపణలపై నిజాముద్దీన్‌పై కాలిఫోర్నియా పోలీసులు కాల్పులు జరిపారు.