Shubhanshu Shukla | భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఈ మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మరికొన్ని నిమిషాల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లనున్నారు. ఇప్పటికే వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్‌లోని వ్యోమనౌకలో కూర్చున్నారు. సరిగ్గా 12:01 (భారత కాలమానం ప్రకారం) గంటలకు ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
వ్యోమనౌకలోకి వెళ్లేముందు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తనకు ఎంతో ఇష్టమైన పాటను విన్నారు. గతేడాది విడుదలైన హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ చిత్రంలోని ‘వందేమాతరం’ (Vande Mataram) పాట అంటే శుభాన్షుకు ఎంతో ఇష్టమట. ఈ సందర్భంగా రోదసి యాత్రకు వెళ్లే ముందు ఆ పాటను విన్నారు. ‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమం అలాంటిది. శత్రువు కూడా మనకు సెల్యూట్ చేస్తాడు’ అంటూ సాగే దేశభక్తిని రగిలించే ఈ పాటను కెన్నెడీ స్పేస్ సెంటర్లోని లాంచ్ ప్యాడ్ 39-Aకి వెళుతూ విన్నారు. ఈ మిషన్‌కు శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉనాన్సిక్-విన్సివిస్క్లు మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. మే 29న చేపట్టాల్సిన ఈ మిషన్ ఆరుసార్లు వాయిదా పడింది.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్కు..
Shubhanshu Shukla | రోదసి యాత్రకు రెఢీ.. డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వ్యోమగాములు
Donald Trump | ఇరాన్లో అధికార మార్పిడిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్