Shubhanshu Shukla | భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘యాక్సియం-4’ మిషన్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (International Space Station) వెళ్లనున్నారు. మరికాసేపట్లో ఈ ప్రయోగం జరగనుంది. ఈ నేపథ్యంలో వ్యోమగాములు (Astronauts) ఐఎస్ఎస్కు వెళ్లేందుకు రెఢీ అయ్యారు. నలుగురు వ్యోమగాములు డ్రాగన్ అంతరిక్ష నౌకలోకి వెళ్లి కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ ఫొటో బయటకు వచ్చింది. మరికాసేపట్లో ఈ డ్రాగన్ నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ను ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించబోతున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
గురువారం ఉదయం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం ) డాకింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ మిషన్‌కు పెగ్గీ విట్సన్ కమాండర్‌గా, శుక్లా మిషన్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. హంగేరీకి చెందిన టిబోర్ కపు, పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉనాన్సిక్-విన్సివిస్క్లు మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. మే 29న చేపట్టాల్సిన ఈ మిషన్ ఆరుసార్లు వాయిదా పడింది.
అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం (Axiom Space) చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్-4’ మిషన్ (Ax 4 mission)లో భాగంగా స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ (SpaceX Falcon 9 rocket) ద్వారా వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో ప్రైవేట్ రోదసి యాత్ర ద్వారా ఐఎస్ఎస్కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు చరిత్రకెక్కనున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకోనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read..
Shubhanshu Shukla | శుభాన్షు శుక్లా రోదసి యాత్రకు రంగం సిద్ధం.. మరికొద్దిసేపట్లో ఐఎస్ఎస్కు..
F 35B Fighter Jet | పది రోజులుగా భారత్‌లోనే బ్రిటన్ ఫైటర్ జెట్..!