టెహ్రాన్, ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతున్నది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ ఇంటరిగానే పోరాడుతున్నట్టు కనబడుతున్నది. శత్రు నిరోధ వ్యూహంలో భాగంగా ఇరాన్ చాన్నాళ్లుగా పశ్చిమాసియాలో పారామిలిటరీ గ్రూపుల నెట్‌వర్క్‌పై ఆధారపడింది. దీనిని ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్‌గా పేర్కొనే వారు.
లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇరాన్‌లోని పాపులర్ మొబలైజేషన్ ఫోర్సెస్ (పీఎంఎఫ్), యెమెన్లోమి హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ ఇందులో భాగస్వాములు. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడికి దిగినప్పుడు ఇవి ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తుండేవి. అయితే ఇవి గత కొన్నేండ్లుగా ఇజ్రాయెల్ నుంచి చావుదెబ్బలు తిని కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఇవి ఇరాన్‌కు రక్షణగా నిలిచే అవకాశం లేదు.
ఇరాన్‌తో రష్యా, చైనాల సైనిక సహకారం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అయితే ఈ రెండు దేశాలు ఇరాన్‌కు బహిరంగంగా మద్దతు పలుకవన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాలు అవసరమైతే కొద్దోగొప్పో శక్తిమంతమైన ఆయుధాలను అందిస్తాయే తప్ప యుద్ధంలోకి దిగవు. దాడులను రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇక అణ్వాయుధాలు కలిగిన ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్థాన్ వైఖరి గత ఏడాది జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం నాడే వెల్లడైంది. పేరుకు ఇస్లామిక్ దేశమైనా ఇది అమెరికాను కాదని ఇరాన్‌కు మద్దతు తెలిపే పరిస్థితి ఎంతమాత్రం లేదని పరిశీలకులు అంటున్నారు.
కాగా, ఈ ప్రమాదకరమైన యుద్ధ పరిస్థితులకు టెహ్రానే కారణమంటూ యూఏఈ, ఖతార్, కువైట్ లాంటి అరబ్ దేశాలు ప్రకటించడమే కాక, ఇరాన్‌కు తగు విధంగా బుద్ధి చెబుతామంటూ హెచ్చరించాయి. అలాగే యూఏఈ, బెహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణు దాడులు చేయడాన్ని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండిస్తున్నది. ఆ ఐదు దేశాలకు సంఘీభావం ప్రకటించిన సౌదీ అరేబియా దీనిపై దీటుగా స్పందించడానికి అవసరమైన సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది.
ఇక అమెరికా విషయం తీసుకుంటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని యూఎస్ పాశ్చాత్య మిత్ర దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌లు ఖండిస్తున్నప్పటికీ అమెరికాపై తమ వైఖరిని స్పష్టం చేయలేదు. అయితే ప్రస్తుత ఉద్రిక్తతలు తగ్గడానికి అవసరమైన సహకారం అందిస్తామని ప్రకటించాయి. ఇక ఇటలీ ప్రధాని అయితే ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆ దేశ పౌరులకు తమ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. భారత్ అయితే ఎప్పుడూ ఏ దేశానికి మద్దతు ప్రకటించకుండా తటస్థంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.