యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్‌పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్‌లో బుక్ చేసుకున్నా క్షణాల్లో నో స్టాక్ చూపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక డబ్బులు ఎక్కువైనా కొందరు యూరియా లిక్విడ్ వాడాల్సిన పరిస్థితి దాపురించింది.
క్షణాల్లోనే నో స్టాక్..
జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు వరకు 24వేల టన్నులు యూరియా అవసరం ఉందని అధికారుల అంచనా. కానీ ఇప్పటికే 24వేల మంది రైతులు 1.35లక్షల బ్యాగ్‌లతో 29వేల టన్నుల యూరియా కొనుగోలు చేశారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నారు. కొంత మంది అవసరం లేకున్నా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారని పేర్కొంటున్నాయి. ఐదెకరాల్లోపు ఒక దఫా, ఆపై ఉంటే రెండు దఫాలుగా స్టాక్ ఇస్తున్నారు. ఒక్కో ఎకరాకు రెండు నుంచి రెండున్న బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఇక ఉదయం 10గంటలకు యూరియా బుకింగ్ కోసం యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన క్షణాల్లోనే యూరియా ఔట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
అదనపు ఖర్చుతో అరిగోస..
పంటలకు సకాలంలో యూరియా చల్లాలి. అప్పుడే పంట ఎదుగుతుంది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకుంటున్నది. రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉంటుంది. దీంతో చేసేదేం లేక కొందరు రైతులు లిక్విడ్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఎకరాకు అదనంగా రూ. 1500 వరకు ఎక్కువ ఖర్చు వస్తున్నది. లిక్విడ్‌కు రూ.2వేలు, స్ప్రే చేసినందుకు రూ. 500 అదనపు భారం పడుతున్నది. అదే యూరియాతో అయితే కేవలం వెయ్యితో సరిపోయేది. ప్రభుత్వం తీరుతో తిప్పలు తప్పడంలేదు.

నిత్యం రైతుల ఆందోళన బాట..
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిత్యం రైతులు ఆందోళన బాట పడుతున్నారు. యూరియా బుక్ కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలిగొండ, ఆలేరు, రాజాపేట, చౌటుప్పల్, పోచంపల్లిలో రైతులు ఆందోళన చేపట్టారు. పాత విధానంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. నారాయణపురం మండలంలోని సర్వేల్లో ఓ రైతు అధికారులపై విరుచుకుపడ్డారు. చస్తేగానీ యూరియా ఇవ్వరా అని మండిపడ్డారు.
బుకింగ్ ఎట్లా ?
యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 5లక్షల ఎకరాల్లో 2.50లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో 3.15లక్షల ఎకరాల్లో వరి వేశారు. అయితే యూరియా కొనుగోలు కోసం ఫిబ్రవరి 8న సర్కారు యాప్‌ను తీసుకొచ్చింది. ఇక్కడే అసలు తంటా వచ్చి పడింది. గతానికి భిన్నంగా యాప్‌లో మాత్రమే యూరియాను బుక్ చేసుకోవాల్సి ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల్లో చాలా మంది చదువుకోని నిరక్షరాస్యులే ఉన్నారు. వారికి స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో కూడా సరిగా తెలియదు. ఇక యాప్ వినియోగం అసలే రాదు. బుకింగ్, ఓటీపీ అంటే తెలియక కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివిధ గ్రామాల్లోని రైతులు ఫోన్లు తీసుకొని మండల కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇక మండలాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. రైతులకు తెలియక అయోమయానికి గురవుతున్నారు.
ఒక్క బస్తా కూడా రాలేదు..
మాకు పావు తక్కువ రెండు ఎకరాల పొలం ఉంది. యూరియా కోసం ఉదయం 8గంటలకే వచ్చా. యాప్‌లో బుక్ చేసిన వారికే ఇస్తామంటున్నరు. నాకేం చేయడం రాదు. ఎవరిని చేయమన్నా చేస్తలేరు. ఇప్పటికీ ఆఫీసుకు మూడు సార్లు వచ్చా. ఒక్క బస్తా కూడా రాలేదు. రైతులందరికీ సరిపడా యూరియా ఇవ్వాలి.
– పి. సరమ్మ, రైతు, ఇంద్రియాల, భూదాన్‌పోచంపల్లి
పది రోజుల నుంచి తిరుగుతున్నా..
నాకు ఎకరం 25గంటల భూమి ఉంది. పదిరోజుల నుంచి ఆఫీసుకు వస్తున్న ఒక్క బస్తా అందలేదు. యాప్‌లో బుక్ చేద్దామని చూసేలోపే నో స్టాక్ అని కనిపిస్తున్నది. వరి చేనుకు మందు వేస్తేనే ఎదుగుతుంది. గతంలో చల్లని గాలితో ఆగమైంది. ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. పరిస్థితి అనుకూలంగా ఉందని యూరియా కోసం వచ్చిన. ఒక్క బస్తా కూడా దొరకలేదు. గతంలోనే బాగుంది.
– ఉప్పునూతల యాదగిరి, రైతు, భీమనపల్లి, భూదాన్‌పోచంపల్లి
అందరికీ యూరియా అందించాలి..
గతంలో యూరియా కొనుగోలుకు పరిమితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎకరాకు రెండు నుంచి రెండున్నర బస్తాలు మాత్రమే ఇస్తున్నది. ఇది సరిపోవడంలేదు. అనేక మంది రైతులు యారియా దొరక్క లిక్విడ్ వినియోగిస్తున్నారు. దీని ద్వారా రైతులపై అధిక భారం పడుతున్నది. అందరికీ సరిపడా యూరియా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-అబ్బగోని వెంకటేశ్ గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్