జెరూసలెం: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో ప్రతిదాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు చెందిన హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ ఎర్రగా మారిపోయింది. రియల్ టైమ్ హెచ్చరికలు, అత్యవసర మార్గదర్శకాలు చూయించడమే ఈ యాప్ ప్రత్యేకత. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులను అది గుర్తించడం వల్లే రెడ్ కలర్లోకి మారిపోయిందని నిపుణులు తెలిపారు.
ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్‌పోర్టును మూసేశారు. అన్ని విమాన సేవలను రద్దు చేశారు. మరోవైపు, పౌర విమానాలకు ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్, యూఏఈ, ఖతర్ తదితర దేశాలు తమ గగనతలాలను మూసేశాయి. ఎయిరిండియా, ఇండిగో వంటి విమానాయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు, వాణిజ్య నౌకలపై దాడులను పునఃప్రారంభించినట్టు యెమెన్‌కు చెందిన హౌతీలు ప్రకటించారు.
శంషాబాద్ రూరల్: ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్ధానికి దిగడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు శనివారం ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దోహా, కువైట్, షార్జా, అబుధాబి, యూఏఈలకు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేయడంతో ఆయా దేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ నుంచి వెనుదిరిగారు.