Delimitation | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇది 2026 వరకూ కొనసాగనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపాయి. అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-82, ఆర్టికల్-170 ల ప్రకారం దేశంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణన జరగాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లోక్సభ, విధానసభ సరిహద్దులను నిర్ణయించాలి. ఆ తర్వాత రిజర్వేషన్లు మారుస్తూ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించడానికి పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. దేశంలో అన్ని ప్రాంతాలకు, కులాలకు సమన్యాయం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. కానీ గడచిన 50 ఏండ్లుగా నియోజకవర్గాల విభజన జరగలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విభజన జరిగితే దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయి.
దేశంలో ఇప్పటి వరకు 1952, 1963, 1973, 2002 లలో నాలుగుసార్లు నియోజక వర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు మనకున్న నియోజకవర్గాల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973 లో నిర్ణయించడం జరిగింది. దేశంలో జనాభా పెరుగుదల ప్రమాదకరంగా మారిందని భావించి జనాభా నియంత్రణ జరగాలనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రక్రియను 2001 వరకు నిలిపివేయడం జరిగింది. 2002లో పునర్విభజన జరపాలని ఎన్డీఎ ప్రభుత్వం భావించింది. కానీ దక్షిణాది రాష్ర్టాలు నష్టపోతాయని దక్షిణానికి చెందిన భాగస్వామ్య పార్టీలు అడ్డుకోవడం జరిగింది. ఫలితంగా 2026 వరకు నిషేధాన్ని పొడిగించారు. అంటే గత 50 సంవత్సరాల నుంచి దేశంలో నియోజకవర్గాల పెరుగుదల నిలిచిపోయింది.
దీనికి కారణం 1976 తరువాత దక్షిణాది రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వ జనాభా నియంత్రణ కార్యక్రమాలను పాటించి జనాభాను నియంత్రణలోకి తెచ్చి దేశాభివృద్ధికి దోహదం చేశాయి. కానీ ఉత్తరాది రాష్ర్టాలు జనాభాను అడ్డు అదుపు లేకుండా పెంచుకుంటూ పోయాయి. జనాభా నియంత్రణ చేసినందుకు శిక్షగా దక్షిణ భారత రాష్ర్టాలు తమ నియోజకవర్గాలు కోల్పోవాల్సి వస్తుంది. అదే ఉత్తర భారత రాష్ర్టాలు తాము చేసిన తప్పుకు బహుమతిగా నియోజకవర్గాలు పెరుగుతాయి. కనుక జనాభా నిష్పత్తి ఆధారంగా కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 81కు సవరణ చేయడం ద్వారా దక్షిణ భారత రాష్ర్టాలు నష్టపోకుండా కొత్త ఫార్ములా తీసుకురావాలి.
స్వతంత్రం వచ్చిన తరువాత దక్షిణ భారత రాష్ర్టాలు అన్ని రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించి ఈ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. జనాభా నియంత్రణను నియమబద్ధంగా పాటించడం వల్ల దేశ జనాభాలో 18శాతం మాత్రమే ఉన్నా దేశ జీడీపీలో 35శాతం వాటా దక్షిణాది రాష్ర్టాలదే. ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే జాతీయ సగటు కంటే అధికంగా నమోదు చేసుకొని మొదటి 5 స్థానాలలో నిలుస్తున్నాయి. దేశంలో మిగతా 24 రాష్ర్టాలలో పోలిస్తే దక్షిణ భారత రాష్ర్టాలు ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్నాయి.
దేశంలో వసూలయ్యే పన్నుల వాటాలో సింహ భాగం దక్షిణాది రాష్ర్టాల నుంచి వస్తున్నది. కానీ ఇక్కడి నుండి వచ్చే పన్నుల్లో అత్యధిక శాతం ఉత్తర భారతదేశంలో ఖర్చు చేస్తున్నారు. మానవాభివృద్ధి సూచి మొదలుకొని అన్ని అభివృద్ధి సూచిల్లో దక్షిణాది రాష్ర్టాలు ముందువరుసలో ఉన్నాయి. కానీ దేశంలో ఎప్పుడో ఒకటి అర తప్ప అత్యధిక భాగం ఉత్తరాది నాయకుల పెత్తనమే ఉంటుంది. ఎందుకంటే అన్ని పార్టీల్లో వారి సంఖ్య అత్యధిక కావడం వల్ల. కనుక ఉత్తరాది రాష్ర్టాలకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తుంది. ఇప్పటికే అన్యాయానికి గురవుతున్న దక్షిణ భారత రాష్ర్టాలకు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పెంపుదల చేస్తే మరింత అన్యాయం జరుగుతుందనే భావన వ్యక్తమవుతోంది.
చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు.
విపక్ష పార్టీలు సైతం జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో దిగొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం జనగణన చేపట్టి.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆలోచిస్తున్నది. ఒకవేళ అదే గనుక జరిగితే దక్షిణాది రాష్ర్టాలకు మొత్తం కలిపి 165 స్థానాలు మాత్రమే ఉంటాయి. మిగిలిన 24 రాష్ర్టాలకు 683 స్థానాలు ఉంటాయి. ఇందులో కూడా అత్యధిక స్థానాలు గంగానది తీర ప్రాంత రాష్ర్టాలు, హిందీ భాష మాట్లాడే రాష్ర్టాలకు లభిస్తాయి.
ఒక్క ఉత్తరప్రదేశ్లో 63 స్థానాలు పెరిగి 143 స్థానాలు అవుతాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ర్టాల్లో గెలిస్తే చాలు దేశాన్ని పాలించవచ్చు. దక్షిణ భారత రాష్ర్టాలు ఈ దేశాన్ని పాలించే అవకాశం శాశ్వతంగా కోల్పోయి మైనారిటీ ప్రజలుగా, మైనారిటీ రాష్ర్టాలుగా మిగిలిపోతాయి. బీజేపీకి దక్షిణ భారతదేశంలో సమీప భవిష్యత్తులో బలం పెరుగుతుందనే నమ్మకం పోయింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటక కూడా చేజారిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతదేశంలో సీట్లు పెంచుకోవటం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నది. కానీ అదే జరిగితే ఉత్తర, దక్షిణ భారత దేశాల ప్రజల మధ్య విభజనకు దారి తీస్తుంది. దక్షిణాది ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నదని బలంగా నమ్ముతారు. అది తిరుగుబాటుకు దారి తీస్తుంది. రాజకీయ వైషమ్యాలు పక్కన పెట్టి దక్షిణ భారత రాష్ర్టాల నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి దేశంలో అన్యాయానికి గురవుతున్న అనేక చిన్న రాష్ర్టాలను కలుపుకొని ఉద్యమించకుంటే శాశ్వత బానిసలుగా మిగిలిపోవాల్సి వస్తుంది.
Also Read..
Bomb Threats | వరుస బాంబు బెదిరింపులతో అప్రమత్తం.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు
Census | వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కలు షురూ.. 2028లో నియోజకవర్గాల పునర్విభజన
Terror Attack | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు.. టెర్రరిస్ట్ హతం