Census | దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇది 2026 వరకూ కొనసాగనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియ అనంతరం లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపాయి. అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి.
18 నెలల పాటు ప్రక్రియ
జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హోంశాఖ ఈ ప్రక్రియకు నేతృత్వం వహించనున్నది. 2026లో ప్రభుత్వం గణాంకాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ప్రధానమంత్రి కార్యాలయం తుది అనుమతులు రాగానే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంటోంది. కాగా, ఇప్పటికే జనాభాలో చైనాను భారత్ దాటిపోయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిందని గత ఏడాది ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొన్న విషయం తెలిసిందే.
చివరిసారిగా 2011లో..
చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం జనగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Also Read..
C-295 Aircraft | సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారం ప్రారంభం
Air Pollution | ఢిల్లీలో అధ్వాన స్థితికి గాలి నాణ్యత.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు
Terror Attack | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు.. టెర్రరిస్ట్ హతం