Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతోంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాలను తగులబెడుతుండడంతో ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. దీనికి తోడు పొగమంచు కూడా రాజధాని ప్రాంతాన్ని ఆవహించింది. దీంతో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (Air Quality Index) అధ్వానస్థితికి చేరినట్లు కాలుష్య నియంత్రణ మండలి (Central Pollution Control Board) పేర్కొంది.
సోమవారం ఉదయం ఢిల్లీలో ఏక్యూఐ 328 వద్ద నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారింది. ఇక్కడ సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఏక్యూఐ 357 గా నమోదైనట్లు పేర్కొంది. ఇక అక్షర్ధామ ఆలయం వద్ద 357గా గాలి నాణ్యత నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు వెల్లడించింది. గాలి నాణ్యత క్షీణించడంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే.
Also Read..
Nuts For Weight Loss | పండుగ సీజన్లో బరువు పెరగకుండా ఉండాలంటే వీటిని తినండి..!
Hyderabad | హైదరాబాద్లో నెల రోజులు ఆంక్షలు.. ర్యాలీలు, ధర్నాలు నిషేధం: సీవీ ఆనంద్