తిప్పర్తి/నీలగిరి, మార్చి 4: నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం కాంగ్రెస్ పార్టీ నేత ఉట్కూరు సందీప్‌రెడ్డి మరోమారు అధికారుల అండతో దుశ్చర్యకు పాల్పడ్డాడు. పొట్టదశకు వచ్చిన పొలాన్ని మట్టితో పూడుస్తుండగా అడ్డుకున్న బాధితులపై కులం పేరుతో దుర్భాషలాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గత సర్పంచ్ ఎన్నికల్లో తన భార్య గెలుపునకు సహకరించలేదనే కారణంతో కాంగ్రెస్ నేత సందీప్‌రెడ్డి పలువురిపై కక్ష పెంచుకున్నాడు. గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు కావడంతో దళిత కుటుంబంపై కన్నుపెట్టాడు. సబ్‌స్టేషన్ నిర్మాణానికి గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ ఉంది. తనకు వ్యతిరేకంగా పనిచేసిన పాలకోట్ల శ్రీనివాస్ భూమిని ఎంచుకున్నాడు. శ్రీనివాస్ 454 సర్వే నంబర్లో 30 గుంటల ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటూ అసైన్డ్ కమిటీ ఆదేశాల ప్రకారంగా పట్టాపొందాడు.
అందులోనే సబ్‌స్టేషన్ నిర్మాణం చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతులు మీదుగా శంకుస్థ్ధాపనకు చర్యలు మొదలు పెట్టాడు. కార్యకర్తలను పెద్ద ఎత్తున పోగుచేసి గత నెల 28న 30 ట్రాక్టర్ల మొరంతో సాగు చేస్తున్న పొలంపైకి వచ్చాడు. విషయం తెలిసిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వచ్చి బతిమలాడినా వినకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి శ్రీనివాస్ పొలం వద్ద ఉన్న గడ్డిమందును తాగి ఆత్మహత్యకు యత్నించి, దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రతి విషయంలో సందీప్‌రెడ్డి దౌర్జన్యం చేస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
కక్ష కట్టి నాభూమి లాక్కుంటున్నారు
30 సంవత్సరాలుగా 30 గుంటల భూమిని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. పొట్టదశకు వచ్చిన పొలంలో సందీప్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి 30ట్రాక్టర్లతో ఒకేసారి మట్టిని తీసుకువచ్చి పూడ్చాడు. కుటుంబ సభ్యులమంతా ఆపినా ఆపకుండా కులం పేరుతో దూషిస్తూ.. తొక్కిసంపుతామంటూ బెదించాడు. అధికారులు స్పందించి నా భూమి నాకు ఇప్పించాలి. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– పాతకోట్ల శ్రీనివాస్, దళితరైతు
కలెక్టర్ ఆదేశాలతోనే అసైన్డ్భూమి పట్టా రద్దు
మండలంలోని ఎల్లమ్మగూడెంలో 454 సర్వేనంబర్‌లో పాకొట్ల శ్రీనివాస్‌కు 30 గుంటల భూమి ఉంది. కానీ కలెక్టర్ ఆదేశాల ప్రకారం 2021లో ఆ భూమి పట్టా రద్దు చేయడం జరిగింది. ఆ భూమిని 2025లో విద్యుత్ శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. శ్రీనివాస్ ఆదేశాలను ఖాతరు చేయకుండా పంటలు వేశాడు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– రామకృష్ణ, తిప్పర్తి తహసీల్దార్