న్యూఢిల్లీ/న్యూయార్క్, మార్చి 4 : అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. కేవలం హొర్ముజ్ జలసంధి ద్వారా జరిగే సరుకు రవాణానేగాక, అంతర్జాతీయ సముద్ర రవాణా, విమానయాన కార్గోలపైనా ప్రభావం చూపుతున్నది. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆ మార్గం గుండా వెళ్లే నౌకల కదలికలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ప్రధానంగా ముడి చమురు రవాణాను దెబ్బతీసింది. హొర్ముజ్కు ఇరువైపులా వందలకొద్ది ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి మరి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో 20 శాతం హొర్ముజ్ ద్వారానే జరుగుతున్నది. గల్ఫ్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పాదక దేశాలేనన్న సంగతి విదితమే. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఈ సంక్షోభం.. ఒక్క చమురు రవాణాను మాత్రమేగాక ఔషధాలు, సెమీకండక్టర్లు, ఎరువులు ఇలా అన్నింటి సరఫరాలను ప్రభావితం చేస్తుండటం గమనార్హం.
భారత్ నుంచి ఔషధాలు, ఇతర ఆసియా దేశాల నుంచి సెమీకండక్టర్లు, కంప్యూటర్ చిప్‌లు, బ్యాటరీలతోపాటు మిడిల్ ఈస్ట్ నుంచి ఎరువుల తయారీకి వినియోగించే చమురు ఆధారిత ఉత్పత్తుల రవాణాకు ఈ యుద్ధం ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెడుతున్నది. తమ సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండటంతో గల్ఫ్ తీరాల్లోనే భారీగా కార్గో షిప్‌లు ఇరుక్కుపోయాయి. దీంతో భారత్ సహా ఆసియా దేశాల నుంచి వెళ్లాల్సిన నౌకలు కూడా ముందుకు కదల్లేకపోతున్నాయి. షిప్పింగ్ డాటాను వెల్లడించే క్లార్క్సన్స్ రిసెర్చ్.. దాదాపు 500 అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు యూఏఈ, ఒమన్ తీరాల్లో రవాణా కోసం వేచిచూస్తున్నట్టు చెప్తున్నది. ప్లాస్టిక్, రబ్బర్, నైట్రోజన్ ఎరువుల తయారీకి వినియోగించే పెట్రో రసాయన పదార్థాలు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడవన్నీ నిలిచిపోయాయి.
హొర్ముజ్ జలసంధి మార్గం మూతబడిన నేపథ్యంలో సరుకు రవాణా కోసం భారత్ తదితర దేశాల నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే కార్గో షిప్‌లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. ఎర్ర సముద్రం, సూయజ్ కెనాల్ మీదుగా వేల కిలోమీటర్లు 10-14 రోజులు అదనంగా ప్రయాణిస్తున్నాయి. దీంతో ఇంధన వాడకం పెరిగి రవాణా వ్యయమేగాక, బీమా ఖర్చులు ఎగిసి ఆయా సరుకుల ధరలు ప్రభావితం కావాల్సి వస్తున్నది. ఒక్కో షిప్‌నకు ఇంధన ఖర్చు సుమారు 1 మిలియన్ డాలర్లు పెరుగుతున్నదని అంచనా. ఇది అంతర్జాతీయ సముద్ర రవాణాను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నది. అలాగే ఈ యుద్ధం కొనసాగితే భారత్, చైనా సహా ఆయా దేశాల ఎగుమతులు దెబ్బతినడం ఖాయమన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సహా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఇరాక్ మరికొన్ని దేశాలు తమ గగనతలాలను మూసేశాయి. అమెరికాకు అండగా ఉంటున్నారని పొరుగు దేశాలపైనా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతున్నది. దీంతో ఆయా దేశాల మీదుగా విమాన ప్రయాణాలూ వ్యయభరితంగా మారాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ఆ దేశాల గగనతలాల వినియోగంపై ఆంక్షలున్నాయి. దీంతో దూరపు మార్గాల్లో వెళ్లడంతో కార్గో రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నది.