Bomb Threats | దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపు (Bomb Threats) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా 400కుపైగా విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేసింది.
ఇలాంటి ఘటనలను పరిష్కరించడానికి ఎన్ఐఏ సైబర్ విభాగం బెదిరింపు కాల్స్‌పై సమగ్ర విశ్లేషణ ప్రారంభించింది. బెదిరింపు కాల్స్‌కు వెనుక ఉన్న ఉద్దేశాలను తెలుసుకునే పనిలో పడింది. ఇతర భద్రతా సంస్థలతో కలిసి బెదిరింపు కాల్స్‌పై విచారణ చేపడుతోంది. ప్రధాన విమానాశ్రయాల్లో బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ (BTAC) బృందాన్ని మోహరించింది. బెదిరింపులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందించేలా ఈ బృందం శిక్షణ ఇస్తుంది. అంతేకాదు విమానాశ్రయాల్లో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తుంది.
గత కొన్ని రోజులుగా ఇండిగో, ఎయిర్ ఇండియా సహా వందలాది విమానాలకు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. రోజులో కనీసం వంద విమానాలకు ఇలాంటి బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణంగా విమానాలు ఆలస్యం కావడానికి తోడు.. ప్రయాణికుల్లో తీవ్ర భయాలు నెలకొంటున్నాయి. అదే సమయంలో విమానయాన సంస్థలు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి.
బాంబు బెదిరింపులతో కోట్ల మేర నష్టం..!
‘విమానంలో బాంబు పెట్టాం’ అని దుండగులు, ఆకతాయిలు పంపిస్తున్న హెచ్చరికలతో విమానాశ్రయాల్లో హైరానా నెలకొంటున్నది. ఏ విమానానికి బాంబు బెదిరింపు వచ్చినా కచ్చితంగా బాంబు థ్రెట్ అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) ప్రొటోకాల్, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం తనిఖీల ప్రక్రియను చేపట్టాల్సిందే. దీంతో అనేక విమానాలు ఆలస్యమవుతున్నాయి. అప్పటికే ప్రయాణంలో ఉన్న విమానాలను ఉన్నపళంగా వేర్వేరు విమానాశ్రయాలకు దారి మళ్లించాల్సి వస్తున్నది. ఫలితంగా విమానయాన సంస్థలు నష్టపోతున్నాయి. గత తొమ్మిది రోజుల్లో వచ్చిన బాంబు బెదిరింపులకు విమానయాన సంస్థలు దాదాపుగా 600 కోట్లకుపైగా నష్టపోయి ఉంటాయని గతంలో ఓ విమానయాన సంస్థలో పని చేసిన ఓ అధికారి తెలిపారు. సాధారణంగా ఒక డొమెస్టిక్ విమాన సర్వీసుకు అంతరాయం కలిగితే సగటున రూ.1.5 కోట్లు నష్టం వస్తుందని, అంతర్జాతీయ విమానానికి ఇది దాదాపు రూ.3.5 కోట్ల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
Also Read..
Census | వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కలు షురూ.. 2028లో నియోజకవర్గాల పునర్విభజన
KTR | నీ పదినెలల పాపపు పాలనలో రాష్ట్రానికి ప్రతిరోజు నష్టమే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
Terror Attack | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు.. టెర్రరిస్ట్ హతం