న్యూఢిల్లీ: మూడు యుద్ధ నౌకల డాకింగ్ కోసం ఫిబ్రవరి 28న ఇరాన్ అనుమతి కోరినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే మార్చి 1న అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. (S Jaishankar) అమెరికా- ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితి గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దేశాల మధ్య శత్రుత్వాలు తీవ్రమవుతున్నాయని, భద్రతా పరిస్థితి గణనీయంగా క్షీణించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలను తగ్గించాలని, సంయమనం పాటించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న 10 మిలియన్ల మంది భారతీయుల భద్రత, ఇంధన భద్రత, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
కాగా, గత నెలలో భారతదేశం నిర్వహించిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ విన్యాసాల్లో పాల్గొన్న మూడు ఇరాన్ యుద్ధ నౌకల గురించి కూడా ఎస్ జైశంకర్ రాజ్యసభలో మాట్లాడారు. ‘ఈ ప్రాంతంలోని మూడు నౌకలు భారత ఓడ రేవులలో డాక్ చేయడానికి ఫిబ్రవరి 28న ఇరాన్ అనుమతి కోరింది. దీనికి మార్చి 1న ఆమోదం లభించింది’ అని అన్నారు. ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ లావన్ మార్చి 4న కొచ్చిలో డాక్ అయ్యిందని చెప్పారు. భౌగోళిక రాజకీయ పరిగణనల కంటే ‘మానవత్వం’ కారణంగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం నాటి కార్యక్రమంలో స్పష్టం చేశారు.
మరోవైపు మార్చి 4న హిందూ మహాసముద్రంలో ఉన్న మరో ఇరాన్ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాను అమెరికా జలాంతర్గామి పేల్చి ముంచేసింది. అందులోని 130 మంది సిబ్బందిలో 80 మందికిపైగా నావికులు మరణించారు. శ్రీలంక నౌకా దళం సుమారు 32 మంది సిబ్బందిని రక్షించింది.
అయితే భారత్ అతిథిని అమెరికా దారుణంగా దెబ్బతీసిందని ఇరాన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో వచ్చిన విమర్శలపై జైశంకర్ స్పందించారు. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. భారత నేవీ కూడా రెస్క్యూలో పాల్గొన్నట్లు చెప్పారు. మానవత్వంతో మరో ఇరాన్ యుద్ధ నౌకను రక్షించినట్లు వెల్లడించారు.
Also Read:
IndiGo flight U-turn | ఇథియోపియా సరిహద్దు దగ్గర ఇండిగో విమానం యూ టర్న్.. ఢిల్లీలో ల్యాండ్
Man Sets Partner on Fire | స్కూటీ ఇచ్చేందుకు నిరాకరణ.. మహిళ, ఆమె పేరెంట్స్కు నిప్పంటించిన వ్యక్తి