బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15తో విక్టర లై(కెనడా)పై అద్భుత విజయం సాధించాడు. గంటా 37 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో లక్ష్యసేన్ అసమాన పోరాటపటిమ కనబరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీ బరిలోకి దిగిన ఈ యువ షట్లర్ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేశాడు. 2022లో ఇదే టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సేన్‌కు ఇది రెండో ఫైనల్. ఆదివారం జరిగే టైటిల్ పోరులో చైనీస్ తైపీకి చెందిన వరల్డ్‌నంబర్ 11 షట్లర్ లిన్ చున్ యితో లక్ష్య తలపడనున్నాడు. ఈ పోరులో లక్ష్యసేన్ గెలిస్తే దాదాపు రెండున్నర దశాబ్దాల భారత కల సాకారమైనట్లే. చివరిసారి భారత్ తరఫున గోపీచంద్(2001) ఆల్ ఇంగ్లండ్ టోర్నీ విజేతగా నిలువగా, అంతకముందు ప్రకాశ్ పదుకునే(1980) ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే లక్ష్యసేన్, విక్టర్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ముఖాముఖి పోరులో తలపడటం తొలిసారి అయినా లక్ష్యసేన్ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు. తొలి గేమ్‌ను 21-16తో కైవసం చేసుకునే క్రమంలో ఈ షట్లర్ పాయింట్ పాయింట్‌కు చెమటోడ్చాల్సి వచ్చింది.