Tejashwi Yadav : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కు కేవలం కొన్ని రోజుల ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటర్ల జాబితా (Voters list) ను సవరిస్తుండటంపై అభ్యంతరాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. బీహార్లో, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఈసీ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ (Bihar Assembly) లో, పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్జేడీ అగ్రనేత, బీహార్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తేజస్వియాదవ్ మరోసారి ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా తన గళం వినిపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో అధికార బీజేపీ తమకు వ్యతిరేకంగా ఉన్న లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల్లో ఓట్లు వేసింది, మోదీని ప్రధానిగా ఎన్నుకున్నదని ఇప్పటి జాబితాలో ఉన్న ఓటర్లేనని, అప్పుడు కరెక్టుగా ఉన్న జాబితాకు ఇప్పుడు ఏమైందని తేజస్వి ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం వెనక్కి తగ్గకపోతే తాము బీహార్ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.