న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ కోటా(ఈక్యూ) టికెట్ల కన్ఫర్మేషన్ కోసం రైల్వేశాఖ రూల్స్‌ను మార్చేసింది. సాధారణంగా వీఐపీలు, రైల్వే ఉద్యోగులు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నావాళ్లు మాత్రమే ఈ కోటా(Emergency Quota)లో టికెట్లు తీసుకుంటారు. అయితే చార్ట్ ప్రిపరేషన్‌కు ముందు గతంలో ఈక్యూ కోసం దరఖాస్తు సమర్పిస్తే, ఆ ప్రయాణికులు ఎమర్జెన్సీ కోటాలో టికెట్లు కన్ఫర్మ్ అయ్యేవి. ఇప్పుడు 8 గంటల ముందే ప్యాసింజర్ చార్ట్ ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో ఈక్యూ టికెట్ల దరఖాస్తులను కూడా ముందుగా చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది.
చివరి నిమిషాల్లో ఈక్యూకు దరఖాస్తు చేసుకోవడం వల్ల .. చార్ట్ ప్రిపరేషన్ ఆలస్యం అవుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. కొత్త రూల్ ప్రకారం.. ఈక్యూ టికెట్ కావాలనుకున్న వారు.. వాళ్లు ఈక్యూ దరఖాస్తును కనీసం ఒక రోజు ముందుగా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు.
రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ప్రారంభం అయ్యే రైళ్లకు .. ఈక్యూ టికెట్లు కావాలనుకుంటే ఆ ప్రయాణికుల దరఖాస్తులు జర్నీ రోజు కన్నా ఒక రోజు ముందు మద్యాహ్నం 12 గంటల వరకు ఈక్యూ సెల్లో తమ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 12 లోపు బయలుదేరే రైళ్లకు .. ప్రయాణికులు ఈక్యూ కోటా కావాలనుకుంటే ముందు రోజు సాయంత్రం 4 గంటల లోపు తమ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.