సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 15:24:17

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేది మ‌హాఘ‌ట‌‌బంధ‌నే

ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేది మ‌హాఘ‌ట‌‌బంధ‌నే

పాట్నా : మ‌హాఘ‌ట‌బంధ‌నే బీహార్‌లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుంద‌ని ఆర్జేడీ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ ధీమా వ్య‌క్తం చేశారు. బీహార్ మాజీ సీఎం ర‌బ్రీదేవీ నివాసంలో ఆర్జేడీ పార్టీ ఎమ్మెల్యేల‌తో తేజ‌స్వి యాద‌వ్ స‌మావేశం నిర్వ‌హించి, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై చర్చించారు. ఈ సంద‌ర్భంగా తేజ‌స్వి యాద‌వ్ మాట్లాడుతూ.. ఆర్జేడీ ఎమ్మెల్యేలంద‌రూ నెల రోజుల పాటు పాట్నాలోనే ఉండాల‌ని కోరారు. ఎన్డీయే కూట‌మిలో హెచ్ఏఎం, వీఐపీ ఎమ్మెల్యేల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త‌ను బ‌ట్టి త‌మ నిర్ణ‌యం ఉంటుంద‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు ఉంటాయ‌ని తేజ‌స్వి స్ప‌ష్టం చేశారు. బీహార్ ప్ర‌జ‌లంతా మ‌హాఘ‌ట‌బంధ‌న్ వైపే ఉన్నారు. కానీ ఎన్నిక‌ల క‌మిష‌న్ మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ప్ర‌వ‌ర్తించింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదేం తొలిసారి కాదు.. 2015 ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా ఇదే జ‌రిగింద‌న్నారు. బీజేపీ దొంగ‌దారిన అధికారాన్ని చేజిక్కించుకుంద‌ని తేజ‌స్వి ఆరోప‌ణ‌లు చేశారు. ఆర్జేడీని ఆద‌రించిన బీహార్ ప్ర‌జ‌ల‌కు తేజ‌స్వి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

బీహార్ శాస‌న‌స‌భ ఫ‌లితాల్లో ఎన్డీయే కూట‌మి 125(బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 3, హెచ్ఏఎం 4), మ‌హాఘ‌ట‌బంధ‌న్ 110(ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, సీపీఐఎంఎల్ఎల్ 11, సీపీఎం 3, సీపీఐ 2), ఎల్జేపీ ఒక స్థానంలో, ఇత‌రులు 7 స్థానాల్లో గెలుపొందారు. బీహార్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 124.