Shubhanshu Shukla | అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తర్వాత తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని శుభాన్షు కలవనున్నారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని 7లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో ప్రధాని మోదీని కలవనున్నారు. సాయంత్రం 5-5:30 మధ్య మోదీ-శుభాన్షు మధ్య సమావేశం జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
యాక్సియం-4 మిషన్ విజయవంతం తర్వాత శుభాన్షు శుక్లా భారత్ రావడం ఇదే మొదటిసారి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శుభాన్షు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వీ. నారాయణన్ ఘనంగా స్వాగతం పలికారు. ఇక ఇవాళ మోదీతో భేటీ తర్వాత శుభాన్షు లక్నోకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరుగనున్న నేషనల్ స్పేస్ డేలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్టోబర్‌లో మొదలయ్యే గగన్‌యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారు.
యాక్సియం-4 మిషన్‌లో (Axiom-4 Mission) భాగంగా శుక్లా బృందం ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు శుక్లా చీఫ్ పైలట్‌గా వ్యవహరించారు. ఐఎస్ఎస్లో 18 రోజుల పాటూ గడిపిన ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. శుభాన్షు బృందం జులై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు కూడా ఇతనే కావడం విశేషం.
Also Read..
“భారత్‌కు చేరుకున్న శుభాన్షు శుక్లా”
“Shubhanshu Shukla | స్వదేశానికి బయల్దేరిన శుభాన్షు శుక్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం”
“Mann ki Baat | కొత్త ఆలోచనలుంటే నాకు పంపండి.. మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ..!”