Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి బయల్దేరారు. రేపు భారత్‌లో (India) ల్యాండ్ కానున్నారు. సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని శుభాన్షు కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. కాగా, ఆక్సియం-4 మిషన్ ద్వారా శుభాన్షు ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.
ఐఎస్ఎస్ యాత్ర తర్వాత ఆయన తొలిసారి భారత్‌కు వస్తున్నారు. విమానంలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోను శుభాన్షు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తన పోస్టులో రాసుకొచ్చారు. కాగా, శుభాన్షు రేపు భారత్‌లో ల్యాండ్ కానున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అంతేకాదు ఆగస్టు 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నాయి.
యాక్సియం-4 మిషన్‌లో (Axiom-4 Mission) భాగంగా శుక్లా బృందం ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు శుక్లా చీఫ్ పైలట్‌గా వ్యవహరించారు. ఐఎస్ఎస్లో 18 రోజుల పాటూ గడిపిన ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. శుభాన్షు బృందం జులై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. ఇక అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు క్రియేట్ చేశారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్ఎస్లోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు కూడా ఇతనే కావడం విశేషం.
Also Read..
Tungabhadra Dam | పనిచేయని మరో 7 గేట్లు.. తుంగభద్ర డ్యామ్‌కు పొంచిఉన్న ముప్పు..