న్యూఢిల్లీ: ఫైటర్ జెట్ ఇంజన్ల నుంచి కృత్రిమ మేధ వరకు అన్ని రంగాలలో స్వయం సమృద్ధిని సాధించి సమృద్ధి భారత్‌గా మారుదామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో భారీ మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ కవచం సుదర్శన్ చక్రను రూపొందుతున్నట్లు వరుసగా 12వ సారి ఎర్రకోటపై నుంచి దేశ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో మోదీ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా స్వార్థ ప్రయోజనాలు పెరుగుతున్న తరుణంలో స్వయం సమృద్ధిని సాధించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. వేరే దేశం తలరాతను మార్చడానికి మన శక్తిని వృథా చేసుకోరాదని, పూర్తి శక్తితో మన తలరాతను మనమే మార్చుకుందామని, అప్పుడే మన సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వాధినేతగా తన 25 సంవత్సరాల అనుభవాన్ని ప్రస్తావిస్తూ ఈ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఏ స్వార్థ ప్రయోజనం మనల్ని వశపరుచుకోలేదని ఆయన పేర్కొన్నారు.
ఉగ్రవాదులు, వారికి ఆశ్రయమిస్తున్న వారు తమ దృష్టిలో సమానమని, భవిష్యత్తులో ఎటువంటి దుస్సాహసనానికి ఒడిగట్టినా భారత సైన్యం తగిన గుణపాఠం నేర్పుతుందని పాకిస్థాన్‌కు ప్రధాని హెచ్చరికలు జారీచేశారు. భారత్ చాలాకాలం అణ్వస్త్ర బెదిరింపులను సహించిందని, ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మోదీ స్పష్టంచేశారు. ప్రస్తుత రూపంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ అంగీకరించదని, తమ న్యాయమైన హక్కులను పాకిస్థాన్‌కు మళ్లించడం వల్ల భారతీయ రైతులకు ఊహించలేనంత నష్టం జరిగిందని ఆయన చెప్పారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని పురస్కరించుకుని సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశామని మోదీ తెలిపారు. ఆ ఒప్పందం పునరుద్ధరణ ఎన్నటికీ జరగదని స్పష్టంచేశారు. దేశీయంగా రక్షణ వ్యవస్థను తయారు చేసుకోవడానికి సంబంధించి కార్యాచరణకు పిలుపునిచ్చిన ప్రధాని కీలకమైన వ్యూహాత్మక, పౌర కేంద్రాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను రక్షించుకోవడానికి శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రం తరహాలో ఈ వ్యవస్థను రూపొందించనున్నట్లు తెలిపారు. శత్రువు నుంచి వచ్చే ఎటువంటి దాడినైనా నిర్వీర్యం చేయడమేగాకుండా రెట్టింపు శక్తితో ఎదురుదాడి చేయగలదని ప్రధాని తెలిపారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్సవాలు జరగనున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ జాతి నిర్మాణం కోసం ఆ సంస్థ సేవలను ప్రశంసించారు. దేశ యువత కోసం లక్ష కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభించనున్నట్టు చెప్పారు. ప్రైవేట్ కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున నెలకు రూ.15 వేలు అందజేయనున్నట్టు ప్రకటించారు. సెమికండక్టర్లు సహా అనేక అంశాల్లో దేశం సొంతకాళ్లపై నిలబడుతున్నదని, త్వరలో మేడిన్ ఇండియా చిప్‌లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.