బెంగళూరు, ఆగస్టు 15: రెండు దశాబ్దాల క్రితం ధర్మస్థలలో తన కుమార్తె అదృశ్యమైందని, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని ఒక తల్లి చేసిన ఆరోపణ చుట్టూ భిన్నమైన వాదనలు, సరిపోలని కాలక్రమం అలుముకుంది. మణిపాల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కుమార్తె అనన్య భట్ 2003లో తన మిత్రులతో కలసి ధర్మస్థల పర్యటనకు వచ్చి అదృశ్యమైందని సుజాతా భట్ అనే మహిళ ఇటీవల సిట్‌కు ఫిర్యాదుచేశారు. తాను కోల్‌కతాలో సీబీఐలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశానని, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి 2004లో బెంగళూరుకు వెళ్లిపోయానని ఆమె తెలిపింది. అయితే ఆమె చేసిన ప్రకటనపై పలువురు సాక్షులను, పత్రాలను, పత్రికా కథనాలను, అధికార వర్గాలను తెలంగాణ టుడే ప్రశ్నించి, పరిశోధించగా ఆమె చెప్పిన విషయాల్లో చాలా వైరుధ్యాలు ఉన్నట్లు తేలింది.
స్థానికుల వాంగ్మూలాలు, పాత పత్రికల కథనాల ప్రకారం సుజాతా భట్ శివమొగ్గ జిల్లాలోని రిప్పన్పేట్లో 1999 నుంచి 2007 వరకు ప్రభాకర్ బలిగ అలియాస్ నయీ ప్రభాకర్ అనే వ్యక్తితో కలిసి నివసించారు. ప్రభాకర్ గతంలో ఉడుపిలో బస్ ఏజెంట్‌గా పనిచేశాడు. వీరిద్దరూ వివాహం చేసుకోనప్పటికీ సహజీవనం సాగించారు. వీరి గురించి అక్కడి స్థానికులందరికీ తెలుసు. 2002, 2003లో ఈ జంట గురించి కమల్వాణి, సుధా వీక్లీ వంటి స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. పిల్లలు లేని ఈ జంట వీధి కుక్కలను ప్రేమగా సాకడం, వాటిని తమ సొంత పిల్లలని చెప్పుకోవడం గురించి ఈ కథనాల్లో ఉంది.
ఆ పత్రికా కథనాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. సుజాతను మేము రోజూ చూసేవాళ్లం. ఆమెకు పిల్లలు లేరు. అనన్య అనే కుమార్తె వారికి లేనే లేదు అని సామాజిక కార్యకర్త, ప్రభాకర్ క్లాస్మేట్ ఆర్ కృష్ణప్ప తెలంగాణ టుడేకి తెలిపారు. మద్యానికి బానిసైన ప్రభాకర్ 2007లో సుజాతను విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. ఓ జడ్జిగారి ఇంట్లో పనిచేసేందుకు తాను బెంగళూరుకు వెళ్లిపోతున్నట్లు సుజాత ఇరుగుపొరుగు వారికి చెప్పారు. ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. విడిపోయిన రెండేళ్ల తర్వాత 2009లో ప్రభాకర్ మరణించాడు.
1995 నుంచి 2004 వరకు తాను కోల్‌కతాలో సీబీఐలో పనిచేశానని సుజాత చెబుతుండగా 1999 నుంచి 2010 మధ్య తమ కార్యాలయంలో ఆ పేరుతో ఏ ఉద్యోగి పనిచేయలేదని కోల్‌కతాలోని సీబీఐ అధికార ప్రతినిధి తెలంగాణ టుడేకి స్పష్టం చేశారు. ఆమె 10వ తరగతి వరకు మాత్రమే చదువుకుందని, 2000 దశకంలో బెంగళూరులోని ఓ కిరాణా దుకాణంలో హెల్పర్‌గా కొద్దికాలం పనిచేసి ఆ తర్వాత మాయమైందని సుజాత సొంత మరిది మహాబాల తెలిపారు.