Meghalaya murder : రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో పోలీసులు విచారిస్తున్నా కొద్దీ నిందితులు పలు కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు. తన భర్తను హత్య చేస్తే రూ.4 లక్షలు ఇస్తానని సోనమ్ (Sonam) ముందుగా తమకు ఆఫర్ చేసిందని, హత్య అనంతరం మృతదేహాన్ని లోయలో పడేయడానికి నిరాకరించడంతో ఆఫర్‌ను ఏకంగా రూ.20 లక్షలకు పెంచిందని నిందితులు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో పడేయడంలో సోనమ్ కూడా తమకు సహకరించిందని నిందితులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇదిలావుంటే రాజాను హత్య చేసిన నిందితులు ముగ్గురూ అతడికి ముఖ పరిచయం ఉన్నవాళ్లేనని పోలీసుల విచారణలో తేలింది. ఆ పరిచయంతోనే నిందితులు రాజాను పలకరించి, మాటల్లో పెట్టి ఒక్కసారిగా దాడిచేసి ప్రాణం తీసినట్లు వెల్లడైంది.
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి పలు వివరాలు రాబడుతున్నారు.