Sonam Raghuvanshi : రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో అరెస్టయిన నిందితులను పోలీసులు ప్రశ్నించినా కొద్ది షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. రాజాను హత్య చేసిన అనంతరం అతడి భార్య సోనమ్ (Sonam).. రాజా ఫోన్ తీసుకుని అతడి సోషల్ మీడియా ఖాతా (Social Media account) లో ఓ పోస్టు పెట్టింది. ‘ఏడు జన్మలపాటు కలిసి జీవిద్దాం (Together for seven lives)’ అని ఆ పోస్టులో పేర్కొంది.
రాజా రఘువంశీ ఫోన్ కలవడం లేదని అతడి తల్లి అప్పటికే కోడలికి ఫోన్ చేస్తుండటంతో.. అతడికి ఏం జరిగిందోనని రాజా కుటుంబం అనుమానించకుండా ఉండటం కోసం సోనమ్ ఇలా చేసింది. మేఘాలయలో రాజాను హత్య చేసిన కిరాయి హంతకులు పోలీసుల విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు. మే 23న మధ్యాహ్నం 2.15 గంటలకు సోనమ్ ఈ పోస్టు చేసింది. అంటే అంతకంటే ముందే రాజా హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణ వచ్చారు.
కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత సోనమ్ కోసం పోలీసులు వెతుకుతుండగా సోమవారం తెల్లవారుజామున యూపీలో ఆమె సజీవంగా ప్రత్యక్షమైంది.
భర్త హత్య అనంతరం ఇండోర్‌లోనే ఓ హోటల్లో సోనమ్ 18 రోజులపాటు బస చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ హోటల్లో ఓ గది అద్దెకు తీసుకుని ఆమెను అందులో ఉంచినట్లు వెల్లడైంది. ఆ తర్వాత ఆమెను ట్యాక్సీలో ఘాజీపూర్‌కు పంపినట్లు విచారలో తేలింది. ప్రస్తుతం నిందితులు ఐదుగురిని పోలీసులు విచారిస్తున్నారు.