Op Honeymoon : భార్యతో కలిసి హనీమూన్ (Honeymoon) కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ మొదలుపెట్టారు. ఈ విచారణలో నిందితులు హత్యకు సంబంధించి పలు విషయాలు వెల్లడించినట్లు దర్యాప్తు బృందంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన ప్రకారం.. మే 23న రాజా రఘువంశీని హత్య చేసిన అనంతరం సోనమ్ రఘువంశీ కూడా ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి 11 కిలోమీటర్లు నడిచివెళ్లింది. ఆ తర్వాత సోనమ్ గువాహటికి వెళ్లి అక్కడి నుంచి రైలులో మే 25న ఇండోర్‌కు చేరుకుంది. అక్కడ సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ ఓ హోటల్ గదిలో ఆమెను ఉంచాడు. అతడు కూడా పక్కనే మరో హోటల్లో ఉన్నాడు.
అదేవిధంగా ముగ్గురు కిరాయి హంతకులకు కూడా రాజ్ కుశ్వాహ ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కావడం, అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు ఉండటంతో మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారింది. సోనమ్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా రాజ్ కుశ్వాహతో తరచూ ఫోన్లో మాట్లాడినట్లు తేలింది.
ఈ లోగా రాజ్ కుశ్వాహ.. సోనమ్‌ను ట్యాక్సీ మాట్లాడి ఉత్తరప్రదేశ్‌కు పంపించాడు. ఆ తర్వాత పోలీసులు రాజ్ కుశ్వాహను అదుపులోకి తీసుకుని విచారించగా కిరాయి హంతకుల విషయం, హత్యకు ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సోనమ్ యూపీలోని ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. తాను మాదకద్రవ్యాలు ఇచ్చారని, తాను ఏ హత్య చేయలేదని డ్రామాకు తెరలేపింది.
కానీ పోలీసులకు అప్పటికే రాజ్ కుశ్వాహ ద్వారా విషయం తెలిసి ఉండటంతో ఆమెది డ్రామా అని వెంటనే గుర్తించారు. అనంతరం మేఘాలయ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మీద షిల్లాంగ్‌కు తరలించారు. అదేవిధంగా కిరాయి హంతకుల లోకేషన్‌ను ట్రేస్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను కూడా ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ మీద షిల్లాంగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన మేఘాలయ పోలీసులకు మృతదేహం పడి ఉన్న దగ్గర కత్తి దొరికింది. అక్కడికి సమీపంలోనే హంతకుడు ఆకాశ్ షర్ట్ లభ్యమైంది. ఆ షర్ట్ అంతా రక్తపు మరకలతో ఉంది. ఘటనా ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సోనమ్ రెయిన్ కోట్ లభ్యమైంది. రక్తం మరకలైన షర్ట్‌ను విప్పేసిన ఆకాశ్‌కు సోనమ్ తన రెయిన్ కోట్ ఇవ్వగా.. ఆరు కిలోమీటర్ల నడక తర్వాత అతడు ఆ రెయిన్‌కోట్‌ను కూడా తీసిపారేశాడు. ఆ తర్వాత అంతా ఇండోర్‌కు చేరుకుని వేర్వేరు చోట్ల మకాం వేశారు.
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న ఉత్తర కాసీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి పలు వివరాలు రాబడుతున్నారు.