Sonam Raghuvanshi : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) కు చెందిన 29 ఏళ్ల రాజా రఘువంశీ (Raja Raghuvanshi) తన భార్యతో కలిసి హనీమూన్కు వెళ్లి మేఘాలయ (Meghalaya) లో హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మే 23 నుంచి రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) దంపతులు కనిపించకుండా పోవడం, జూన్ 2న ఓ లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కావడం, జూన్ 9న సోనమ్ రఘువంశీ ప్రాణాలతో వచ్చి పోలీసులకు లొంగిపోవడం ఇప్పుడు చర్చనీయాంశాలయ్యాయి.
సోనమ్ రఘువంశీయే కిరాయి హంతకులను పెట్టి రాజా రఘువంశీని హత్య చేయించి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల్లో ఒకడైన రాజ్ కుశ్వాహ తన తండ్రి కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి కావడంతో సోనమ్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనమ్ పుట్టింటి చుట్టుపక్కల ఇళ్ల వాసులు స్పందించారు. సోనమ్ చాలా మంచి అమ్మాయని చెబుతున్నారు.
సోనమ్ అందరితో కలుపుగోలుగా ఉండేదని, అందరూ ఆమెను బిట్టీ అనే ముద్దుపేరుతో పిలుచుకునే వాళ్లమని తెలిపారు. బిట్టీ ఎంతో సంతోషంగా వివాహం చేసుకుందని, ఆమెను అనుమానించడానికి వారిది ఇష్టం లేని పెళ్లి కూడా కాదని వారు గుర్తుచేసుకున్నారు. ఆమె భర్తను హత్య చేసేంత చెడ్డ మనిషి కాదని అన్నారు. ఇందులో ఏదో జరిగిందని, పోలీసుల దర్యాప్తులో నిజాలు బయటికి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు.