Sonam Raghuvanshi : హనీమూన్ మర్డర్ (Honeymoon murder) కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హనీమూన్ ట్రిప్‌లో ఉన్న రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని అతడి భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) యే హత్య చేయించిందని అంతా భావిస్తున్నారు. హత్య జరిగిన 11 రోజుల తర్వాత ఆమె పోలీసుల ముందు లొంగిపోవడంతో ఆమెపై అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో తన భర్త రాజా రఘువంశీ దుండగుల నుంచి తనను రక్షించి తాను హత్యకు గురయ్యాడని ఘాజీపూర్‌లోని ఓ దాబా యజమానికి సోనమ్ రఘువంశీ చెప్పడంతో కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.
సోమవారం తెల్లవారుజామున ఒంటిగంటకు సోనమ్ రఘువంశీ నడుచుకుంటూ తన దాబా వద్దకు వచ్చిందని, తన కుటుంబంతో మాట్లాడటానికి తనకు ఫోన్ కావాలని అడిగిందని ఘాజీపూర్‌లోని దాబా ఓనర్ సాహిల్ యాదవ్ తెలిపారు. తాను సోనమ్ చెప్పిన నెంబర్‌కు డయల్ చేసి ఇచ్చానని, ఆమె తన ఫ్యామిలీతో మాట్లాడుకుందని, ఆమె ఎక్కువసేపు మాట్లాడలేకపోవడంతో తాను వారితో మాట్లాడానని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులు.. తమ కుమార్తె రక్షణ కోసం దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని తనను కోరారని సాహిల్ యాదవ్ వెల్లడించారు. ఫోన్ మాట్లాడిన తర్వాత తాను అసలు ఏం జరిగిందని సోనమ్‌ను ఆరా తీశానని చెప్పారు. ముందుగా ఆమె తనకు నీళ్లు కావాలని అడిగిందని, ఆమె నీళ్లు తాగిన తర్వాత మాట్లాడుతూ.. తాను, తన భర్త హనీమూన్ ట్రిప్‌కు మేఘాలయ వెళ్లామని, అక్కడ కొందరు తనపై దాడిచేసి ఒంటిపై ఉన్న నగలు లాక్కోబోయారని చెప్పిందని తెలిపారు.
దుండగుల నుంచి తనను కాపాడే క్రమంలో తన భర్త హత్యకు గురయ్యాడని చెబుతూ సోనమ్ గట్టిగా విలపించిందని సాహిల్ చెప్పారు. ఆ తర్వాత తాను పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆమెను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. అయితే సోనమ్ చెప్పేది నిజమా అబద్ధమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.