Meghalaya murder : మేఘాలయ (Meghalaya) లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) కు చెందిన రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భర్తను హనీమూన్ (Honeymoon) కు తీసుకెళ్లి భార్యే కిరాయి హంతకులతో హత్య చేయించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దాంతో దేశంలో ఈ హత్య విషయం చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ చివరిసారిగా తన అత్తతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బయటికి వచ్చాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశీ తన కోడలు సోనమ్ రఘువంశీతో ఫోన్లో మాట్లాడింది. ముందుగా ‘రాజా ఫోన్ పనిచేస్తోందా..’ అని ఉమా రఘువంశీ ప్రశ్నించింది.
అందుకు సోనమ్ రఘువంశీ పొంతన లేని సమాధానం చెప్పింది. ‘మేం ఇప్పుడు ఎత్తైన కొండ ఎక్కుతున్నాం. పైకి చేరుకున్న తర్వాత మళ్లీ ఫోన్ చేస్తాం’ అని సమాధానం ఇచ్చింది. అయితే ఆ తర్వాత వాళ్లు ఉమా రఘువంశీకి ఫోన్ చేశారా లేదా అనేది తెలియదు. అయితే సోనమే ఈ హత్య చేయించిందని నిరూపించడానికి ఈ ఫోన్ కాల్లో రెండు క్లూస్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
‘రాజా ఫోన్ పని చేస్తోందా’ అని అతడి తల్లి అడిగిన దానికి సోనమ్ నేరుగా సమాధానం చెప్పకపోవడం మొదటి క్లూ అని, కొడుకు ఫోన్ కలవకపోవడంతో అతడితో మాట్లాడేందుకు తల్లి కోడలుకు ఫోన్ చేసినా.. కోడలు సోనమ్.. భర్తకు ఫోన్ ఇవ్వకుండా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పడం రెండో క్లూ అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఆ ఫోన్ మాట్లాడే సమయానికే రాజా రఘువంశీ హత్య జరిగిందా.. లేదంటే ఆ తర్వాత జరిగిందా అనేది తెలియాల్సి ఉందన్నారు.
ఆ ఫోన్ కాల్లో ‘ఈ రోజు నీకు ఉపవాసం కదా.. ఏమైనా తిన్నావా..?’ అని అత్త ప్రశ్నించగా ‘లేదు ప్రయాణం కారణంగా ఏమీ తినలేకపోయాను’ అని సోనమ్ బదులిచ్చింది. ఇప్పటికైనా ఏమైనా తినమని అత్త సూచించగా.. ఇక్కడ ఏమీ దొరకవని సోనమ్ చెప్పింది. సోనమ్ ఎగపోస్తున్నట్లు గమనించిన అత్త ఏమైందని ఆరా తీయగా పెద్ద కొండ ఎక్కుతున్నామని కోడలు జవాబిచ్చింది.
‘దాంతో అంత పెద్ద కొండపైకి ఎందుకు వెళ్తున్నారు..? దూరం నుంచి చూడొచ్చుగా..’ అని ఉమా రఘువంశీ అడుగగా.. ‘మేం వాటర్ ఫాల్ చూడటానికి వెళ్లాం. నేను కూడా వద్దని చెప్పాను. కానీ ఆయనే వినలేదు’ అని సోనమ్ బదులిచ్చింది. ఆ తర్వాత ఉమా రఘువంశీ ఎంత ప్రయత్నించినా ఇద్దరి ఫోన్లు కలవలేదు. జూన్ 2న ఓ లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది.
జూన్ 9న సోనమ్ రఘువంశీ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో పోలీసులకు లొంగిపోయింది. ఇదే కేసులో ఆమెతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సోనమ్ రఘువంశీ తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి భర్తను హత్య చేయించిందని, అందుకోసం ముగ్గురు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిజనిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.