Honeymoon murder : మేఘాలయ (Meghalaya) లో రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య సంచలనంగా మారింది. ఆయన భార్య సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) నే కిరాయి హంతకులను పెట్టి భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. పెళ్లయిన ఐదు రోజులకే సోనమ్ తన భర్త హత్యకు స్కెచ్ గీసిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ప్రియుడు రాజ్ కుశ్వాహ, మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి సోనమ్ తన భర్త హత్యకు పథక రచన చేసినట్లు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన పెళ్లయిన తర్వాత సరిగ్గా ఐదో రోజు 24 ఏళ్ల సోనమ్.. ప్రియుడు రాజ్ కుశ్వాహ (20), అతని స్నేహితులు ఆనంద్ కుర్మి (23), ఆకాశ్ రాజ్‌పుత్ (19), విశాల్ చౌహాన్ (22) తో ఇండోర్‌లోని ఓ కేఫ్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగానే రాజా రఘువంశీని హనీమూన్ ట్రిప్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి హత్య చేయాలని, దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రించాలని ప్లాన్ వేశారు.
ప్లాన్ ప్రకారం సోనమ్ తన భర్తను హనీమూన్ ట్రిప్‌కు ఒప్పించింది. మే 20న ఇద్దరూ ఇంటి నుంచి బయలుదేరారు. ముందుగా గువాహటిలోని కామాఖ్య ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆ సమయంలో ముగ్గురు కిరాయి హంతకులు కూడా వారిని అనుసరించారు. గువాహటిలోనే ఒక గొడ్డలిని కొనుగోలు చేశారు. కామాఖ్య అమ్మవారి దర్శనం అనంతరం సోనమ్ దంపతులు అక్కడి నుంచి మేఘాలయకు బయలుదేరారు.
మూడు రోజులపాటు మేఘాలయలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ సందర్భంగా కూడా కిరాయి హంతకులు వారిని అనుసరిస్తూనే వారి చుట్టే తిరిగారు. మే 23న మధ్యాహ్నం తర్వాత సోనమ్ తన భర్తను ఉత్తర కాసీ కొండల్లోని ఓ ఎత్తయిన కొండపైకి వెళ్లేందుకు ఒప్పించింది. నిర్మానుష్యంగా ఉండే ఆ కొండపైకి అడవి మార్గం గుండా స్కూటీపై వెళ్లిన తర్వాత.. ఫొటోలు దిగుదామనే సాకుతో నడుచుకుంటూ మరింత ఎత్తుకు వెళ్లేందుకు రాజా రఘువంశీని ఒప్పించింది.
కొండపైకి నడుస్తుండగా కిరాయి హంతకులు ముగ్గురు వచ్చి రాజా రఘువంశీతో మాట కలిపారు. హిందీలో అతనితో మాట్లాడుతూ ముందుకు నడవడం మొదలుపెట్టారు. అదే సమయంలో సోనమ్ తాను అలసిపోయానన్న సాకుతో నిదానంగా నడుస్తూ.. ప్లాన్ ప్రకారం భర్తకు, తనకు మధ్య దూరాన్ని పెంచింది. భర్త, కిరాయి హంతకులు తన నుంచి ఓ యాభై మీటర్ల దూరం వెళ్లగానే ‘అతడిని చంపేయండి’ అని ఆదేశించింది.
ఆ వెంటనే కిరాయి హంతకులు ముగ్గురూ రాజా రఘువంశీని లోయలోకి తోసే ప్రయత్నం చేశారు. అయితే అతను ప్రతిఘటించడంతో తమ వెంట తెచ్చుకున్న గొడ్డలితో తల ముందువైపు, వెనుకవైపు వేటు వేసి లోయలోకి తోశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ తతంగం అంతా సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ కనుసన్నల్లోనే జరిగింది. రాజ్ కుశ్వాహ ప్రత్యక్షంగా మేఘాలయకు వెళ్లకపోయినా అనుక్షణం సోనమ్‌తో ఫోన్లో టచ్‌లో ఉన్నాడు.
అయితే భర్త హత్య అనంతరం 18 రోజులు కనిపించకుండా పోయిన సోనమ్ ఎక్కడ గడిపిందనేది తెలియాల్సి ఉంది. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మే 23 నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ 2న లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది. ఆ తర్వాత సోనమ్ కోసం పోలీసులు వెతుకుతుండగా సోమవారం తెల్లవారుజామున యూపీలో సజీవంగా ప్రత్యక్షమైంది.
దాంతో సోనమే కిరాయి హంతకులను పెట్టి తన భర్తను హత్య చేయించిందనే అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు సోనమ్‌తోపాటు ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహ, ముగ్గురు కిరాయి హంతకులు మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. ట్రాన్సిట్ రిమాండ్ మీద నిందితులు ఐదుగురిని పోలీసులు మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు.