న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భానుడు గత కొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్చాడని, శక్తిమంతమైన అగ్నిజ్వాలలను కక్కుతున్నాడని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా సంభవించే రేడియో బ్లాక్ అవుట్ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తెలిపింది. సూర్యగోళం ఎర్రబడినప్పుడు తీవ్రమైన సౌర తుఫానులు సంభవిస్తాయి. ఇక ఆ తుఫానులు భూగోళం దిశగా సాగితే అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు మాడిమసైపోతాయి.
టీవీ సిగ్నల్స్‌కు అంతరాయం ఏర్పడుతుంది. రాడార్లు, విద్యుత్తు గ్రిడ్లు ప్రభావితమవుతాయి. సూర్య కుటుంబంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అంతరిక్షంలో క్రియాశీలంగా ఉన్న భారత్‌కు చెందిన 50 ఉపగ్రహాలను అనుక్షణం పరిశీలిస్తున్నామని ఇస్రో అధికారులు తెలిపారు. సౌర తుఫానుల కారణంగా ఈ ఉపగ్రహాలు ప్రభావితమైతే దేశంలో కమ్యూనికేషన్, నావిగేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా రేడియో బ్లాక్అవుట్ ఏర్పడితే విమానాలు, నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఇస్రో టెలిమెట్రీ విభాగం డైరెక్టర్ అనిల్‌కుమార్ చెప్పారు. ఎక్కడైనా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే వెంటనే దాన్ని మరమ్మతు చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గ్రౌండ్ స్టేషన్లు ఇప్పటికే మిషన్ కంట్రోల్ కేంద్రాలను అప్రమత్తం చేశాయని, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
సూర్యుని కోపానికి కారణం!
సూర్యుని ఉపరితలంపై కొన్నిసార్లు తాత్కాలిక మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆ చుట్టుపక్కల ప్రాంతంకంటే ముదురు రంగులో ఉంటాయి. దీనిని యాక్టివ్ రీజియన్ 14366 అని పిలుస్తారు. అయస్కాంతపరంగా ఎంతో సంక్లిష్టమైన ఈ మచ్చల సమూహం ఒక్కసారిగా తీవ్రస్థాయిలో ఏర్పడటాన్ని సౌర అలజడిగా లేదా అధిక సూర్యతాపం అని పేర్కొంటారు. గత కొద్ది రోజులుగా ఈ అలజడి తరచుగా సంభవిస్తున్నది. దీంతో నాలుగుసార్లు అత్యంత తీవ్రస్థాయిలో బలమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఈ జ్వాలల్లో ఎక్స్8.1 తరగతి జ్వాల ఈ ఏడాది సంభవించిన శక్తిమంతమైనదిగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ జ్వాలలు ఈ నెల 1, 2 తేదీల్లో అతి తీవ్రస్థాయిలో వెలువడ్డాయని నాసా ధ్రువీకరించింది.
భారత్‌పై ప్రభావం
అత్యంత తీవ్రత కలిగిన ఈ సౌర మంటలు భారీ పరిమాణంలో విద్యుదయస్కాంత రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇవి కాంతి వేగంతో భూమిని చేరుకుంటాయి. అయితే ఈ రేడియేషన్ వల్ల భూమిపైనున్న మానవులకు ప్రత్యక్షంగా ఎటువంటి హాని కలుగకపోయినా.. భూమి ఎగువ వాతావరణంలోని విద్యుదావేశం కలిగిన పొర.. అయనోస్పియర్ను దెబ్బతీయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ఫలితంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినవచ్చని, నౌకలు, విమానాల నావిగేషన్ వ్యవస్థ ప్రభావితం కావచ్చునని, ఉపగ్రహాలు రేడియేషన్‌కు గురికావచ్చని పేర్కొన్నారు.