Slum Dog | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచే విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కలయికపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచుతూ కీలక అప్డేట్స్ను విడుదల చేస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త, దునియా విజయ్, సీనియర్ నటి టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో టబు కనిపించిన తీరు, ఆమె పాత్రను డిజైన్ చేసిన విధానం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పాత్రలో కనిపించనున్నారు. గ్లింప్స్‌ను బట్టి చూస్తే ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటను పెద్దగా పట్టించుకోకుండా, తనకు నచ్చిన నిర్ణయం తీసుకుని దూసుకెళ్లే ఓ స్ట్రాంగ్ ఆఫీసర్ పాత్రలో టబు కనిపిస్తున్నారు. టబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా గౌరీ హెగ్డే పాత్రను పూరి జగన్నాథ్ డిజైన్ చేసినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా ఆమె పాత్రలోని ఆత్మవిశ్వాసం, దూకుడు సినిమాకు కీలకంగా నిలవబోతున్నాయనే ఆసక్తి కలుగుతోంది. గ్లింప్స్ మొత్తాన్ని ఇంటెన్స్‌గా చూపించడంతో టబు పాత్ర చుట్టూ కథలో ఏదైనా కీలకమైన మలుపు ఉంటుందా? అనే చర్చ మొదలైంది.
పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో పాత్రలతో పాటు బలమైన సైడ్ క్యారెక్టర్స్‌కు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’లో టబు పాత్రను కూడా అదే తరహాలో ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి పాత్రకు, టబు పోషిస్తున్న గౌరీ హెగ్డే పాత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది? కథలో ఆమె ఎలాంటి మలుపులకు కారణమవుతారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు.మరోవైపు సంయుక్త, దునియా విజయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో కథలో పలు బలమైన పాత్రలు, వాటి మధ్య సంఘర్షణతో సినిమా సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.