Delhi On High Alert | దేశ రాజధాని ఢిల్లీ హై అలర్ట్‌లో (Delhi On High Alert) ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర సంస్థలు, పుతిన్ వ్యక్తిగత సిబ్బంది తో బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పుతిన్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల పాటూ ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది. రాజధాని చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేశారు. పుతిన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని నగరమంతా హై-అలర్ట్‌లో ఉంచారు. స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు, త్వరిత-ప్రతిచర్య బృందాలతో కూడిన బహుళ స్థాయి భద్రతా గ్రిడ్ ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మందికిపైగా పోలీసు సిబ్బందిని నగరంలో మోహరించారు.
పుతిన్ రాక మొదలుకొని వెళ్లే వరకూ ఆయన కదలికలన్నింటినీ బహుళ భద్రతా ఏజెన్సీలు ట్రాక్ చేయనున్నాయి. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు అమలులో ఉండగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు సలహాలు జారీ చేయనున్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిరోధక విభాగాలు, స్నిపర్లు సున్నితమైన ప్రాంతాల్లో మోహరించాయి. కీలక ప్రాంతాలు, వీవీఐపీలు తిరిగే రూట్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) గురువారం భారత్‌కు చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య 23వ ద్వైపాక్షిక సదస్సు జరగనుండడం విశేషం.
ఉక్రెయిన్‌పై 2022లో రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. గురువారం సాయంత్రం పుతిన్ ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన అధికారిక నివాసంలో విందు ఇవ్వనున్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద సంప్రదాయ స్వాగతంతో పుతిన్ భారత పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది.
భారత్‌ను సందర్శించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు గత కొన్ని వారాలుగా జరుగుతున్నాయి. పుతిన్ భారత్‌లో తినే ప్రతి ఆహార పదార్థాన్ని రష్యా నుంచి తెచ్చిన ల్యాబొరేటరీలో పరీక్షించనున్నారు. అంతేగాక ఆయన పర్యటనలో ప్రత్యేక చెఫ్‌లు కూడా ఉంటారు. వారు రష్యా నుంచి తెచ్చిన వంట దినుసులతోనే పుతిన్‌కు ఆహారం తయారవుతుంది. ల్యాబ్ సిబ్బంది పరీక్షించిన తర్వాతే ఆయనకు భోజనం అందచేస్తారు. పుతిన్ ప్రయాణించే ప్రత్యేక ఓరస్ సెనట్ కారు సైతం ఆయన సందర్శనకు ముందే విమానం ద్వారా భారత్‌కు రవాణా కానున్నది.
భారత్‌లో పుతిన్ విసర్జించే మలమూత్రాలను ఆయన భద్రతా సిబ్బంది ఓ సంచీలో భద్రపరిచి మాస్కోకు తీసుకువెళ్లిపోతారు. అంతేగాక పుతిన్ ఉపయోగించే టాయ్‌లెట్, టెలిఫోన్ బూత్ కూడా మాస్కో నుంచే రానున్నాయి. పుతిన్ భద్రతా బాధ్యతలను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్బీపీ) చూసుకుంటుంది. తమ అధ్యక్షుడి పర్యటనకు ముందుగానే ఆతిథ్య దేశంలోని క్రైమ్ రేటు, ఉగ్రవాదం, నిరసనలు, మతపరమైన కార్యకలాపాల గురించి ఎస్బీపీ ఆరాతీస్తుంది. పుతిన్ బసచేసే హోటల్‌ను కనీసం నెలరోజుల ముందుగానే ఆయన భద్రతా బృందం తనిఖీ చేస్తుంది. ఈ బృందంలో రష్యాకు చెందిన ప్రధాన భద్రతా సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ), ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్(ఎస్వీఆర్) సభ్యులు కూడా ఉంటారు.
అధ్యక్షుడి ఆగమనానికి ముందు హోటల్ రూములోని అన్ని ఆహార పదార్థాలు, పానీయాలు, సోపు, షాంపూ, హ్యాండ్‌వాష్, టూత్‌పేస్టు వంటి వ్యక్తిగత వస్తువులను తొలగించి వాటి స్థానంలో రష్యా నుంచి తెచ్చిన వస్తువులను ఉంచుతారు. పుతిన్ మొబైల్ ఫోన్లను ఉపయోగించరు. పూర్తి సురక్షితమైన కమ్యూనికేషన్ లైనును ఆయన ఉపయోగిస్తారు. ఇందుకోసం అధ్యక్షుడి రూములోనే ఓ టెలిఫోన్ బూత్‌ను ఆయన బృందం ఏర్పాటు చేస్తుంది. టాయ్‌లెట్‌నే కాదు హోటల్ బాత్రూమును కూడా పుతిన్ వాడరు.
ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూము వస్తుంది. దీన్ని కూడా ఆయన గదిలోనే ఏర్పాటు చేస్తారు. పుతిన్ తిరుగు ప్రయాణం కోసం ఓ విమానం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పుతిన్‌తో కనీసం 100 మంది ప్రయాణిస్తారు. వీరిలో వ్యక్తిగత అంగరక్షకులు, ఎస్బీపీ, ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ బృందాలు, ప్రొటొకాల్ ఆఫీసర్లు, పరిపాలనా సిబ్బంది, మీడియా సభ్యులు ఉంటారు. పుతిన్‌తో ప్రయాణించడానికి ముందు ఆయన బాడీగార్డులు రెండువారాల పాటు క్వారంటైన్లో ఉంటారు.
పుతిన్ ప్రయాణించే విమానానికి రక్షణగా ఒకటి లేదా 2 విమానాలు వెన్నంటి ఉంటాయి. అధ్యక్షుడు ప్రయాణించే విమానం అత్యంత అధునాతనంగా ఉంటుంది. అత్యంత అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థ అందులో ఉంటుంది. క్షిపణి దాడులను తట్టుకునే రక్షణ వ్యవస్థ ఈ విమానం ప్రత్యేకత. అంతేగాక ఈ విమానంలో అణ్వస్త్ర కమాండ్ కంట్రోల్ బటన్ కూడా ఉంటుంది. గగనంలోనుంచే అధ్యక్షుడు అణ్వస్ర్తాల ప్రయోగానికి ఆదేశించవచ్చు. విమానంలో అనేక సమావేశ గదులు, కాన్ఫరెన్స్ రూము, బెడ్రూము, బార్, జిమ్, మెడికల్ రూము ఉంటాయి. విమానం లోపలి భాగం బంగారు తాపడం కలిగి ఉంటుంది. ఏకకాలంలో 262 మంది ఇందులో ప్రయాణించవచ్చు. ఏకబిగిన 11,000 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు.
Also Read..
Vladimir Putin: డాన్బాస్ ప్రాంతానికి విముక్తి కల్పిస్తాం: వ్లాదిమిర్ పుతిన్
Supreme Court | బీఎల్వోలకు ఊరట.. అదనంగా సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలకు ‘సుప్రీం’ ఆదేశం..!
La Nina: ఈ శీతాకాలంలో లానినా ప్రభావం 55 శాతం మాత్రమే !