మాస్కో: వివాదాస్పద డాన్బాస్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమికొట్టి, ఆ ప్రాంతాన్ని విముక్తి చేయనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పేర్కొన్నారు. సైనిక చర్య ద్వారా అయినా లేక దౌత్యపరమైన పద్ధతిలోనైనా డాన్బాస్ ప్రాంతాన్ని విముక్తి చేయనున్నట్లు చెప్పారు. భారత పర్యటన సందర్భంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డాన్బాస్ ప్రాంతంలో ఉన్న డోనస్కీ, లుంగాస్క్ ప్రాంతాలు ఉక్రెయిన్ దళాలు విడిచి వెళ్లాలని పుతిన్ భావిస్తున్నారు. నాటోలో చేరే ప్రక్రియను విరమించుకోవాలన్నారు.
డాన్బాస్ ప్రాంతాలను త్వరలోనే ఉక్రెయిన్ ఆర్మీ కోల్పోతుందని పుతిన్ తెలిపారు. ఆ ప్రాంతం నుంచి ఉగ్రవాదుల్ని సైనిక చర్యతో తరిమిస్తామని, లేదా ఉక్రెయిన్ దళాలు అక్కడ నుంచి ఉపసంహరించుకుని, యుద్ధాన్ని ఆపేయాలన్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో అంతగా భీకర యుద్ధం జరగాల్సిన పనిలేదన్నారు. ముందు నుంచీ ఉక్రెయిన్‌కు చెబుతూ వస్తున్నామని, అక్కడ ఉన్న ప్రజలు ఉక్రెయిన్‌తో కలిసి ఉండాలనుకోవడం లేదని, వాళ్లంతా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నారని, స్వతంత్రం కావాలని ఓటు వేశారని, అందుకే ఉక్రెయిన్ అక్కడ నుంచి తమ దళాలను వెనక్కి తీసుకెళ్లాలని, అప్పుడు యుద్ధం ఉండదని, కానీ వాళ్లు ఫైటింగ్ కోరుకున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.