న్యూఢిల్లీ: ప్రపంచ వాతావరణ సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే మూడు నెలల పాటు లానినా(La Nina) పరిస్థితులు కేవలం 55 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూఎంఓ పేర్కొన్నది. లానినా వల్ల ప్రపంచవ్యాప్తంగా వెదర్, వాతావరణ పరిస్థితులపై ప్రభావం పడనున్నది. లానినా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా శీతలంగా ఉండే అవకాశం ఉన్నది. కానీ అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వేడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు యూఎన్ ఏజెన్సీ పేర్కొన్నది.
పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే విరుద్ధ వాతావరణ పరిస్థితులను లా నినా, ఎల్ నినోగా పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్య రేఖకు అటూ ఇటూ ఉన్న ప్రదేశం శీతలంగా మారినప్పుడు లానినా పరిస్థితులు ఉద్భవిస్తాయి. దీని వల్ల శీతల గాలులు, పీడనం, వర్షం నమోదు అవుతాయి. ఇక ఎల్‌నినో పరిస్థితుల వల్ల రుతుపవనాలు తగ్గి, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మూడు నెలల శీతాకాలంలో సెంట్రల్ ఇండియాతో పాటు పశ్చిమ భారత్‌లో సాధారణం లేదా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు కొన్ని రోజుల క్రితం భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లానినా పరిస్థితులు బలహీనంగా ఉంటాయని డబ్ల్యూఎంఓ అంచనా వేసింది. నవంబర్ లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో లానినా పరిస్థితులు బోర్డర్‌లైన్ వద్ద ఉన్నాయని డబ్ల్యూఎంవో పేర్కొన్నది. జనవరి నుంచి మార్చి వరకు 65 శాతం, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు 75 శాతం తటస్థ వాతావరణ పరిస్థితి ఉండనున్నట్లు ప్రపంచ వాతావరణ శాఖ పేర్కొన్నది.