Supreme Court | ఇటీవల కేంద్రం ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియ బూత్ లెవల్ అధికారుల (BLO)పై పని తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఎల్వోలపై పనిభారం తగ్గించేందుకు అదనంగా సిబ్బందిని నియమించాలని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్ ప్రక్రియలో విధుల నుంచి మినహాయింపు కావాలంటూ స్పష్టమైన కారణాలు చెప్పిన బీఎల్వోల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది. వారి స్థానంలో సమర్థులైన అధికారులు, ఇతర సిబ్బందిని కేస్ టూ కేస్ ఆధారంగా నియమించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయంలో అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత సీజేఐ స్పష్టం చేశారు. తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ నేత విజయ్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. బీఎల్వోలుగా తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 32 ప్రకారం పని ఒత్తిడి కారణంగా విధులు నిర్వర్తించలేని బీఎల్వోలపై ఎన్నికల కమిషన్ క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని టీవీకే పార్టీ పిటిషన్లో ఆరోపించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో బీఎల్వోలకు పెద్ద ఊరట లభించినట్లయ్యింది.